Telangana Anthem Released By CM Revanth Reddy: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలంగాణ రాష్ట్ర గీతం 'జయజయహే తెలంగాణ'ను (Jai Jai Hey Telangana) విడుదల చేశారు. హైదరాబాద్ (Hyderabad)లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం.. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతాన్ని విడుదల చేశారు. 'జయజయహే తెలంగాణ' గీతాన్ని అందెశ్రీ రచించగా.. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. కాగా, గీతం విడుదల సందర్భంగా అందెశ్రీ భావోద్వేగానికి గురయ్యారు.



ఈ గీతాన్ని యువ గాయకులు రేవంత్, హారిక్ నారాయణ్ ఆలపించారు. 'జయజయహే తెలంగాణ' గీతాన్ని రాష్ట్ర గీతంగా ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆమోదించింది. ఈ గీతం చుట్టూ పలు వివాదాలు నడిచాయి. కీరవాణికి సంగీతం అప్పగించడంపై పలువురు తెలంగాణ వాదులు అభ్యంతరం తెలిపారు. తాజాగా, ఆదివారం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి గీతాన్న విడుదల చేశారు. ఈ గీతం తెలంగాణ ఏర్పడక ముందు నుంచి ప్రజాదరణ పొందింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కోట్లాది మంది ఉద్యమకారుల్లో ఈ గీతం స్ఫూర్తి నింపింది. తెలంగాణలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాల్లో తెలంగాణ గీతంగా, ప్రార్థనా గీతంగా ఈ గేయాన్ని ఇప్పటికే ఆలపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆ గేయానికి అధికారిక హోదా కల్పించారు. 


గన్ పార్క్ వద్ద సీఎం నివాళి


అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన వారి సేవలను గుర్తు చేసుకున్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. వేడుకల్లో భాగంగా ట్యాంక్ బండ్ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు.