Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. ప్రస్తుత ఫలితాల ట్రెండ్ చూస్తుంటే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం..మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా...దాదాపు 33 చోట్ల బీజేపీ లీడింగ్‌లో ఉంది. మరి కొన్ని చోట్ల కూడా బీజేపీ ముందంజలో ఉందని వెల్లడించింది. ఇక బీజేపీ తరవాత  National People's Party (NPEP) రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఆరు చోట్ల ఈ పార్టీ లీడింగ్‌లో ఉంది. ఓ చోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించినట్టు ఈసీ తెలిపింది. ఇప్పటికే రెండు సార్లు ఇక్కడ పట్టు నిలుపుకున్న బీజేపీ ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రానుంది. ముఖ్యమంత్రిగా ప్రేమ ఖాండు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ కేవలం 50 నియోజకవర్గాల ఫలితాలు మాత్రమే వెల్లడి కానున్నాయి. ఇప్పటికే పది చోట్ల బీజేపీ విజయం సాధించింది. మిగిలిన స్థానాల్లో లీడ్‌లో ఉంది. మొత్తం 60 చోట్ల బీజేపీ పోటీ చేయగా..34 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. ఇక్కడ కాంగ్రెస్‌ పెద్దగా ప్రభావం చూపించినట్టుగా కనిపించడం లేదు. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ ఆఫీస్ ఎదుట డ్యాన్స్‌లు చేశారు. 






ఇక సిక్కిమ్ విషయానికొస్తే..ఇక్కడ 32 అసెంబ్లీ స్థానాలున్నాయి. బీజేపీ 31 చోట్ల తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఇక స్థానిక పార్టీ Sikkim Krantikari Morcha (SKM) ఫలితాల్లో దూసుకుపోతోంది. రెండోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్‌తో పాటు ఆయన  సతీమణి కృష్ణ కుమారి రాయ్‌, మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చమ్లింగ్ ఇక్కడ పోటీ చేశారు. ప్రస్తుత ఫలితాల ట్రెండ్ చూస్తుంటే సిక్కిమ్ క్రాంతికారి మోర్చ క్లీన్‌ స్వీప్ చేసేలా కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకి 17 సీట్లు అవసరం. అయితే...ఈ పార్టీ అంత కన్నా ఎక్కువే సాధిస్తుందన్న అంచనాలున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో SKM పార్టీ 17 చోట్ల విజయం సాధించింది. Sikkim Democratic Front (SDF) 15 చోట్ల గెలిచింది. 


 






Also Read: PM Modi: మొదటి వంద రోజుల్లోనే మోదీ మార్క్, అధికారంలోకి వచ్చీ రాగానే కీలక నిర్ణయాలు