PM Modi 100 Day Agenda: లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక మిగిలింది ఫలితాల ఘట్టమే. ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఓ అంచనా వచ్చింది. ఎక్కడెక్కడ ఎవరు గెలుస్తారో ప్రాథమికంగా అయినా తెలిసింది. ఇన్ని రోజులు ప్రచారంలో బిజీబిజీగా గడిపిన ప్రధాని మోదీ రెండు రోజుల పాటు కన్యాకుమారిలో ధ్యానం చేశారు. ఆ తరవాత మళ్లీ డ్యూటీ ఎక్కారు. ఇవాళ ఒక్కరోజే (జూన్ 2) వరుస పెట్టి సమావేశాలు నిర్వహించనున్నారు. అంతే కాదు. వచ్చే 100 రోజుల పాటు ఏం చేయాలో ఓ అజెండా కూడా నిర్దేశించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తరవాత 100 రోజుల ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోనున్నారు. దాదాపు 7 సమావేశాలు నిర్వహించనున్నారు. మొట్ట మొదట రెమలా తుఫాన్‌ ప్రభావంపై సమీక్ష జరపనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ తుఫాన్‌ గట్టి ప్రభావం చూపించింది. ప్రస్తుతం ఆ రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మోదీ ఆరా తీయనున్నారు. దేశవ్యాప్తంగా విపరీతమైన ఉష్ణోగ్రతల నమోదవుతున్న క్రమంలో దీనిపైనా మోదీ సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటి వరకూ వడగాలలు కారణంగా 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా...ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఆ తరవాత 100 రోజుల ప్లాన్‌పై అధికారులతో చర్చించనున్నారు. కొత్తగా ఎలాంటి పథకాలు తీసుకురావాలి..? పాలనా వ్యూహాలు ఎలా ఉండాలో ఈ భేటీలో నిర్ణయించనున్నారు. 


మోదీ రిటర్న్స్..!


జూన్ 4వ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు (Lok Sabha Election 2024 Results) విడుదల కానున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. మోదీ సర్కార్ హ్యాట్రిక్ కొట్టి తీరుతుందని అన్ని అంచనాలూ తేల్చి చెప్పాయి. ఈ క్రమంలోనే బీజేపీ తదుపరి టర్మ్‌పై దృష్టి పెట్టింది. వచ్చే ఐదేళ్ల పాటు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో లెక్కలు వేసుకుంటోంది. అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే కీలక నిర్ణయాలు తీసునే అవకాశాలున్నాయి. ABP Cvoter Exit Poll 2024 అంచనా ప్రకారం NDA కూటమికి గరిష్ఠంగా 396 స్థానాలు వచ్చే అవకాశముంది. అంటే...మోదీ అనుకున్న 400 లక్ష్యానికి దగ్గర్లోనే ఉందీ సంఖ్య. అయితే...కచ్చితంగా 400 సీట్‌లు వస్తాయని మాత్రం ఇప్పుడప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇక అటు ప్రతిపక్ష కూటమి గరిష్ఠంగా 167 సీట్లు గెలుచుకునే అవకాశముందని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. అంటే...ఈ ఎన్నికల్లో కూటమి ప్రభావం ఆశించిన స్థాయిలో లేనట్టే కనిపిస్తోంది. మోదీ సర్కార్‌ని గద్దె దించాలన్న లక్ష్యంతో కూటమి ఏర్పడినా ఆ తరవాత పార్టీల మధ్య విభేదాలొచ్చాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఐక్యత లేకపోవడం వల్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది ఈ కూటమి. పైగా జోరు మీదున్న బీజేపీని ఢీకొట్టాలంటే వ్యూహాలు మార్చాల్సి ఉంటుంది. ఈ విషయంలో కూటమి ఫెయిల్ అయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు మోదీ మాత్రం తన ప్రభంజనాన్ని కొనసాగిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. 


Also Read: Arvind Kejriwal: తిరిగి తిహార్‌ జైలుకి వెళ్లనున్న కేజ్రీవాల్‌, నేటితో ముగిసిన బెయిల్ గడువు