Trisha Krishnan Next Movie: ఈరోజుల్లో డివోషనల్ జోనర్‌లో సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. హీరోలు దేవుళ్లగా, హీరోయిన్లు దేవతలగా కనిపించడం దాదాపుగా తగ్గిపోయింది. ఈ జెనరేషన్‌లో దేవతగా నటించిన అతి తక్కువమంది హీరోయిన్లలో నయనతార కూడా ఒకరు. 2020లో విడుదలయిన ‘ముకుత్తి అమ్మన్’లో నయన్ దేవత పాత్రలో మెరిసింది. ఇదే మూవీ ‘అమ్మోరు తల్లి’గా తెలుగులో డబ్ కూడా అయ్యింది. అటు తమిళంలో, ఇటు తెలుగులో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఇక ఈ మూవీ సీక్వెల్‌లో దేవతగా మెరవడానికి త్రిష సిద్ధమయినట్టు టాక్ వినిపిస్తోంది.


సీక్వెల్‌లో దేవతగా త్రిష...


థియేటర్లలో కాకుండా నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలయ్యింది ‘ముకుత్తి అమ్మన్’. నేరుగా ఓటీటీలో వచ్చినా కూడా ఈ సినిమాను చూసిన ఆడియన్స్... దీనికి పాజిటివ్ రివ్యూలనే అందించారు. దీంతో ఇప్పుడు దీనికి ఒక సీక్వెల్‌ను ప్లాన్ చేసి దానిని థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సీక్వెల్‌లో నయనతార కాకుండా మరో సీనియర్ హీరోయిన్ అయిన త్రిషకు ఛాన్స్ వచ్చిందని కోలీవుడ్‌లో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. త్రిష ఇప్పటికే ఎన్నో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించింది. చాలా సినిమాల్లో దెయ్యంగా కూడా కనిపించింది. కానీ మొదటిసారి దేవతగా కనిపించడానికి సిద్ధమయ్యింది ఈ సీనియర్ హీరోయిన్.


‘విశ్వంభర’తో బిజీ..


త్రిష హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి ఎన్నో ఏళ్లు అయ్యింది. తన తర్వాత ఎంతోమంది భామలు.. హీరోయిన్లుగా వచ్చి వెళ్లిపోయారు. కానీ త్రిష క్రేజ్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీ షెడ్యూల్‌లో గడిపేస్తోంది. ప్రస్తుతం తన చేతిలో రెండు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ముందుగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’లో త్రిషనే హీరోయిన్‌గా ఎంపికయ్యింది. ఈ మూవీ షూటింగ్‌లో తను పాల్గొన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా తమిళంలో కూడా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో త్రిష భాగమయ్యింది.



ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్..


మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’లో కూడా త్రిషనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలా తెలుగు నుండి ఒకటి, తమిళం నుండి ఒకటి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో త్రిష భాగమవ్వడంతో తన కెరీర్‌కు అసలు బ్రేకుల్లేవని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. చిరంజీవి, త్రిష కలిసి 2006లో విడులదయిన ‘స్టాలిన్’ మూవీలో కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరి కలిసి వెండితెరపై మెరిసే ఛాన్స్ రాలేదు. మళ్లీ 18 ఏళ్ల తర్వాత చిరు, త్రిషలను ఒకే స్క్రీన్ పై చూడడానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక త్రిష, కమల్ హాసన్ కలిసి నటించి కూడా దాదాపు పదేళ్లు అయ్యింది. మొత్తానికి రెండు ఇండస్ట్రీల్లో టాప్ స్టార్లతో నటిస్తూనే దేవత పాత్రకు త్రిష ఓకే చెప్తుందా అనేది ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


Also Read: సౌత్‌లో బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన పూజా హెగ్డే - హీరో సూర్యతో రొమాన్స్‌, ఏ సినిమాలో అంటే..