Arvind Kejriwal To Return To Jail: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్ట్ అయిన జైలుకెళ్లిన అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయాలని, బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు. అందుకు కోర్టు అంగీకరించి బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2వ తేదీన మళ్లీ ఈడీ ఎదుట లొంగిపోవాలని కండీషన్ పెట్టింది. ఈ నిబంధన మేరకు అరవింద్ కేజ్రీవాల్ తిరిగి జైలుకి వెళ్లిపోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఇంటి నుంచి బయల్దేరి తిహార్‌ జైలుకి వెళ్తారు. అయితే..జైలుకి వెళ్లే ముందు రాజ్‌ఘాట్‌కి వెళ్లి మహాత్మా గాంధీకి నివాళి అర్పించనున్నారు. ఆ తరవాత కన్నౌట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. అంతకు ముందు తన ఇంట్లోనే కీలక సమావేశం నిర్వహించారు అరవింద్ కేజ్రీవాల్. ఆప్‌ రాజకీయ వ్యవహారాలపై చర్చలు జరిపారు. ఆప్ నేతలంతా ఒక్కతాటిపై నిలబడాలని సూచించారు. ఆ తరవాత ఇండీ కూటమి సమావేశానికీ హాజరయ్యారు.




ఈ ఏడాది మార్చి 21 న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ పాలసీ రూపకల్పనలో కర్త కర్మ క్రియ కేజ్రీవాల్‌ అని కోర్టులో వెల్లడించింది. లిక్కర్ లైసెన్స్‌లు ఇచ్చేందుకు పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్నట్టు ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. రూ.100 కోట్ల ముడుపులు ముట్టాయని, ఆ డబ్బునో గోవా పంజాబ్ ఎన్నికల ప్రచారానికి వినియోగించారని ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలన్నింటినీ ఆప్‌ కొట్టి పారేసింది. పొలిటికల్‌గా తనను అణిచివేసేందుకు సృష్టించిన కేసు అంటూ కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు.