KTR Comments: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్.. తర్వాత మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ అవగాహన, పరిపక్వత లేదని అన్నారు. చత్తీస్ గఢ్ లో మూడు రోజుల పాటు అవతరణ వేడుకలు నిర్వహిస్తే.. ఇక్కడ కేవలం ఒకరోజుకే పరిమితం చేశారని విమర్శించారు.


‘‘తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. పండుగ వాతావరణం లో జరుపుకుంటున్న దశాబ్ది ఉత్సవాలు పండగలా జరుగుతున్నాయి. సీఎం కు అవగాహన,పరిపక్వత లేదు. ఛత్తీస్ ఘడ్ అవతరణ సందర్భంగా అక్కడ మూడు రోజులు నిర్వహించారు అక్కడి ముఖ్యమంత్రి. కానీ పది సంవత్సరాల తెలంగాణ ను ఒక్క రోజుకు పరిమితం చేశారు ఇక్కడి సీఎం. తెలంగాణ ఏర్పాటు వెనక ఉన్న చరిత్ర, త్యాగాల గురించి  రేవంత్ రెడ్డి కి లేదు. రేవంత్ రెడ్డి ఒక జాక్ పాట్ ముఖ్యమంత్రి. ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన మెసేజ్ లో కనీసం జై తెలంగాణ అనని ఒక మూర్ఖుడుకి కేసీఆర్ గురించి, తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు.


కేటీఆర్ సోషల్ మీడియా పోస్టులు


రాష్ట్ర పదో అవతరణ సందర్భంగా కేటీఆర్ ఎక్స్ ద్వారా వరుస పోస్టులు కూడా చేశారు. ‘‘“Freedom is Not Given, It is Taken” - Netaji Subash Chandra Bose. 2001లోనే, తొట్ట తొలి సభలోనే ..ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధిస్తామని ప్రకటించాలంటే ఎంత ధైర్యం కావాలి..! ఉద్యమబాట వీడితే రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునివ్వాలంటే పుట్టిన మట్టిపై ఎంత ప్రేమ వుండాలి…! అసాధ్యం అనుకునే ఒక స్వప్నాన్ని ..సుసాధ్యం చేసి చూపిస్తాం అని చెప్పిన మాట ఉక్కు సంకల్పానికి నిదర్శనం..! నడి మధ్యలో కాడి పారేసి పారిపోయిన ఉత్తుత్తి ఉద్యమకారులు నకిలీ నాయకులు ఎందరో..! పట్టుదలతో ..నిబద్ధతతో ప్రయాణం చేసి గమ్యాన్ని ముద్దాడిన ఒకే ఒక్కడు..కేసీఆర్…!






కేటీఆర్ శుభాకాంక్షలు
‘‘దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని... దశాబ్దం గడిచిన సందర్భమిది. ఆధునిక భారతం కళ్లరా చూసిన... మరో స్వాతంత్ర్య పోరాటం మన తెలంగాణ ఉద్యమం. బక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన.. కేసీఆర్ పోరాట ఫలితమిది. అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై... 
ఏర్పడిన కొత్త రాష్ట్రం మనది. సబ్బండ వర్గాలు కొట్లాడి, పొట్లాడి.. మా రాష్ట్రం మాకంటూ సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రమిది. 60 ఏళ్ల విధ్వంస గాయాలను.. పదేళ్ల వికాసంతో మాన్పేసుకున్న ఘనకీర్తి మన తెలంగాణది. పాలన చేతకాదంటూ నొసటితో వెక్కిరించిన వాళ్లే.. మనసు నిండా ప్రశంసించిన దశాబ్దమిది. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనేలా.. అనితర సాధ్యంగా సాగింది ఈ దశాబ్ద ప్రయాణం. శతాబ్దంలో సాధ్యంకాని అద్భుతాలు.. దశాబ్దంలో చేసి చూపింది మన తెలంగాణ. నాడు కరవు, రాళ్లురప్పాల, కల్లోలిత తెలంగాణ. నేడు పచ్చని, సుభిక్షమైన కోటి రతనాల వీణ నా తెలంగాణ. అదే స్ఫూర్తి, అదే సంకల్పం ఇకముందు ఉండాలని.. తెలంగాణ దేశానికి దిక్సూచిగా కొనసాగాలని.. కాంక్షిస్తూ...ఆకాంక్షిస్తూ. ప్రతి ఒక్కరికి తెలంగాణ దశాబ్ది ఉత్సావ శుభాకాంక్షలు. జై తెలంగాణ...జైజై తెలంగాణ’’ అని కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.