BRS Celebrate Telangana Decade Celebrations : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని తొలిసారిగా ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భంలో రాష్ట్ర సాధనకు కొనసాగిన పోరాటాలు, త్యాగాలను వారు స్మరించుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరులకు నివాళి అర్పిస్తూ గన్ పార్క్ నుంచి అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
అమరులకు కేసీఆర్ నివాళి
ఈ ర్యాలీలో కేసీఆర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ ముందుగా అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ర్యాలీ ముందుకు సాగింది. కొవ్వొత్తుల ర్యాలీ చేయడం వల్ల ఆ ప్రాంతమంతా వెలుగులు ఆకర్షణీయంగా మారింది. ఈ దశాబ్ది ఉత్సవాలను మరో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఆదివారం తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, దశాబ్ధి కాలం పాలన కార్యక్రమాలను అద్దం పట్టేలా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు.
వారి త్యాగాలు వృధా కావొద్దు
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. అమరుల త్యాగాలను వృథా పోనీయకుండా పదేళ్ల పాటు.. ప్రజల భాగస్వామంతో సాధించిన ప్రగతిని, ప్రజాసంక్షేమాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఆకాంక్షించారు. బాధ్యతతో, చిత్తశుద్ధితో, వ్యక్తిగత ద్వేషాలకు తావివ్వకుండా, తెలంగాణ ప్రగతి, సంక్షేమమే ధ్యేయంగా గత ప్రభుత్వం అందించిన ప్రజా సంక్షేమ పాలన గుర్తుంచుకుని ముందుకుసాగాలని కోరారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ శనివారం కొనసాగిన క్యాండిల్ ర్యాలీ ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు తెలంగాణ వాదులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. అదే విధంగా జూన్2, 3 తేదీల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే దశాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొని నాటి ఉద్యమ స్పూర్తిని చాటి చెప్పాలని కేసీఆర్ తన పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.