హైదరాబాద్ నగర వాసులకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ శుభవార్త చెప్పింది. ECIL క్రాస్ రోడ్స్ -  సికింద్రాబాద్ మార్గం (రూట్ నెంబర్ 24E) లో తాజాగా 8 కొత్త మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులను రాష్ట్ర ఆర్టీసీ #TGSRTC అందుబాటులోకి తెస్తోంది. సోమవారం (జూన్ 2) నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.


ఈ కొత్త మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు ECIL క్రాస్ రోడ్స్ నుంచి ప్రారంభమై.. ఏఎస్ రావు నగర్, సైనిక్ పురి, అమ్ముగూడ, లాల్ బజార్ ల మీదుగా ఖర్ఖనా, జేబీఎస్ (JBS) మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటాయని తెలిపారు. మళ్లీ బస్సులు అదే మార్గంలో ECIL క్రాస్ రోడ్స్ కి వెళ్తాయని సజ్జనార్ చెప్పారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఆర్టీసీ తీసుకొచ్చిన కొత్త 8 మెట్రో బస్ సర్వీసులను వినియోగించుకుని గమ్యస్థానాలకు చేరుకోవాలని టీజీ ఆర్టీసీ సూచించింది. 


బస్సు టైమింగ్స్ వివరాలు.. 
ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ నుంచి సికింద్రాబాద్ కు మొదటి మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ ఉదయం 5:53 గంటలకు ప్రారంభం అవుతుంది. 
ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ నుంచి సికింద్రాబాద్‌కు చివరి మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ రాత్రి 9 గంటల 7 నిమిషాలకు బయలుదేరుతుంది


సికింద్రాబాద్ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్డుకు ఉదయం 6:30 కు మొదటి మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు బయలుదేరుతుంది
అదే సికింద్రాబాద్ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు మార్గంలో చివరి మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు రాత్రి 8 గంటల 52 నిమిషాలకు బయలుదేరుతుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు.


సామాజిక బాధ్యతలోనూ ఆర్టీసీ సిబ్బంది ముందుంటారు 
ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సామాజిక బాధ్యతలోనూ ఆర్టీసీ సిబ్బంది ముందుంటారని సజ్జనార్ అన్నారు. అందుకు నిదర్శనంగా కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ చేసిన పనిని తెలిపారు. ఒక మహిళకు బస్సులో పురిటి నొప్పులు రావడంతో కర్ణాటక ఆర్టీసీ బస్ డ్రైవర్, కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. బస్సును దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి ఆపగా.. డాక్టర్లు ఆమెకు బస్సులోనే సుఖ ప్రసవం చేయగా.. తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నారని సజ్జనార్ పేర్కొన్నారు. కేరళలోని త్రిసూర్ లో 3 రోజుల కిందట ఈ సంఘటన జరిగిందని చెబుతూ... సమయస్ఫూర్తితో వ్యవహరించిన కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ ఏవీ శిజిత్, కండక్టర్ అజయన్ ను ఆయన అభినందించారు.