Gaganyaan Mission: 



ప్రధాని మోదీ విషెస్..


గగన్‌యాన్‌ తొలిదశ విజయవంతంగా పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రోకి అభినందనలు తెలిపారు. అంతరిక్షంలోకి ఆస్ట్రోనాట్‌ని పంపడానికి ఓ అడుగు దూరంలోనే ఉన్నామని వెల్లడించారు. శాస్త్రవేత్తలకు విషెస్ చెప్పారు. ఇప్పటికే చంద్రయాన్ 3 సక్సెస్‌తో ఇస్రో జోరు మరింత పెరిగింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రోకి మద్దతునిచ్చారు. ముందు నుంచి ప్రోత్సహిస్తున్నారు. అందుకే వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది ఇస్రో. ఈ క్రమంలోనే గగన్‌యాన్‌ మిషన్‌కి (Gaganyaan Mission) శ్రీకారం చుట్టింది.


"గగన్‌యాన్‌ మిషన్ సక్సెస్‌తో తొలి హ్యూమ్ స్పేస్‌ ఫ్లైట్ ప్రోగ్రామ్‌లో భారత్‌ ఓ అడుగు ముందుకు వేసినట్టైంది. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు" 


- ప్రధాని నరేంద్ర మోదీ  





ఈ రోజు ఉదయం (అక్టోబర్ 21) 8.45 గంటలకు ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే...ఇంజిన్‌లో గ్లిచ్ కారణంగా రెండు గంటలు ఆలస్యంగా లాంఛ్ చేశారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 10 గంటలకు గగన్‌యాన్‌ మిషన్‌ లాంఛ్ అయింది.  TV D1 Test Flight విజయవంతంగా పూర్తైందని ఇస్రో ప్రకటించింది. అనుకున్న విధంగానే క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ పని చేసింది. ప్రయోగం తర్వాత నింగిలో 17 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్ నుంచి క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌, క్రూ మాడ్యూల్‌ పరస్పరం విడిపోగా సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్‌.. సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది. ఈ ప్రయోగంలో విజయం సాధించటం ద్వారా భవిష్యత్తులో రాకెట్ లో సమస్యలు తలెత్తినా అందులో ఆస్ట్రోనాట్లకు రక్షణ కల్పించేలా ప్రణాళికలు రచిస్తామని ఇస్రో తెలిపింది. అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. ఇందులో భాగంగానే గగన్‌యాన్ మిషన్ చేపట్టింది. 2025 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్ అయ్యే ముందు కాసేపు టెన్షన్ పెట్టింది. టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగా ప్రయోగం రెండు గంటలు ఆలస్యమైంది. అయితే...ఇందుకు కారణమేంటో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వివరించారు. లిఫ్ట్ ఆఫ్ అయ్యే ముందు చిన్న సమస్య ఎదురైందని, అందుకే...ప్రయోగంలో జాప్యం జరిగిందని చెప్పారు.  


"ఇస్రో చేపట్టిన  TV-D1 మిషన్‌ విజయవంతంగా పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. గగన్‌యాన్‌ మిషన్‌లో కీలకమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ని పరీక్షించేందుకు ఈ ప్రయోగం చేపట్టాం. ధ్వని వేగంగా కన్నా కాస్త ఎక్కువ వేగంతోనే వెహికిల్ దూసుకెళ్లింది. ఆ వేగం చేరుకున్న తరవాత క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ యాక్టివేట్ అయింది. క్రూ మాడ్యూల్ విజయవంతంగా విడిపోయింది. మేం అనుకున్నట్టుగానే సముద్రంలోకి దిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి డేటా మా వద్ద ఉంది"


- సోమనాథ్, ఇస్రో ఛైర్మన్ 


Also Read: Gaganyaan Mission: గగన్‌యాన్ కోసం ఎంత ఖర్చవుతుంది? ఈ మిషన్ సక్సెస్ అయితే కలిగే లాభాలేంటి?