Jai Shri Ram Slogans:



జై శ్రీరామ్ నినాదాలు..


ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ కాలేజ్‌లో విద్యార్థి స్టేజ్‌పై జై శ్రీరామ్ (Jai Shri Ram) నినాదాలు చేయడం అలజడి సృష్టించింది. కాలేజ్‌ ఫెస్ట్‌ జరుగుతుండగా ఓ స్టూడెంట్ స్టేజ్‌ ఎక్కి జై శ్రీరామ్ అని గట్టిగా నినాదాలు చేశాడు. ఇది విన్న వెంటనే మిగతా విద్యార్థులు గట్టిగా అరిచారు. వెంటనే స్టేజ్ దిగాలని వార్నింగ్ ఇచ్చారు. ఇది గమనించి ఓ టీచర్ కూడా ఆ విద్యార్థిని మందలించింది.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఘజియాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరిగిందీ ఘటన. ఈ ఘటనతో కల్చరల్‌ ఫెస్ట్‌లో కాసేపు అలజడి రేగింది. స్టేజ్‌ ఎక్కీ ఎక్కగానే జై శ్రీరామ్ అని అరిచాడు ఆ విద్యార్థి. అక్కడితో ఆగకుండా...జై శ్రీరామ్ ఫ్రెండ్స్ అంటూ నినాదాలు చేశాడు.






వెంటనే అక్కడి లెక్చరర్లు అప్రమత్తమయ్యారు. ఇలాంటి కాలేజ్‌ ఫెస్ట్‌లలో అలాంటి నినాదాలు చేయొద్దని మందలించారు. ఈ వీడియో వైరల్ అవడంతో ఘజియాబాద్ పోలీస్ కమిషనర్ అలెర్ట్ అయ్యారు. ఈ ఘటన జరిగిన ప్రాంత పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్ వెంటనే రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించారు. ట్విటర్‌లోనూ పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇండియాలో కాకపోతే పాకిస్థాన్‌లో జై శ్రీరామ్ అనాలా అని ప్రశ్నిస్తున్నారు. 


 






ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన భారత్‌ పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో ఆడియెన్స్ కొందరు పాక్‌ ప్లేయర్‌ని పెవీలియన్‌కి వస్తుండగా జైశ్రీరామ్ అంటూ నినదించారు. మహమ్మద్ రిజ్వాన్‌ డ్రెసింగ్‌ రూమ్‌లోకి వెళ్లిపోయేంత వరకూ అలాగే నినాదాలు చేశారు. మ్యాచ్ జరుగుతుండగా మధ్య మధ్యలోనూ జై శ్రీరాం నినాదాలు గట్టిగానే వినిపించాయి. ఇది పొలిటికల్ హీట్‌ని పుట్టించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు దీన్ని సపోర్ట్ చేశారు. ఇంకొందరు మాత్రం ఎందుకిదంతా అంటూ మండి పడుతున్నారు. నెటిజన్లతో పాటు కొందరు రాజకీయ నేతలూ ఈ వివాదంపై స్పందించారు. పాక్‌ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ 49 పరుగుల వద్ద ఔట్ అయ్యి పెవీలియన్‌కి వచ్చినప్పుడు కొందరు ఈ నినాదాలు చేశారు.


Also Read: ఇస్రో గగన్‌యాన్‌ మిషన్ సూపర్ సక్సెస్, కాసేపు టెన్షన్ పెట్టినా ప్రయోగం విజయవంతం