స్వామి శివానంద.. పద్మశ్రీ పురస్కారం అందుకున్న పెద్ద వయస్కుడు. ఆయన వయసు అక్షరాల 125 ఏళ్లు. వారణాసికి చెందిన స్వామి శివానంద.. పురస్కారం తీసుకునే సమయంలో నమస్కరాం చేసిన తీరు చూసి యావత్ దేశం షాక్ అయింది. యోగా రంగంలో చేసిన విశేష కృషికి గాను యోగా అభ్యాసకుడు స్వామి శివానందకు పద్మశ్రీ అవార్డు లభించింది.


శివానంద 'యోగ్ సేవక్'గా సుపరిచితులు. స్వామి శివానంద అవార్డును స్వీకరించడానికి ముందు గౌరవ సూచకంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మోకాళ్లపై వంగి నమస్కరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివానంద నమస్కరించిన తీరు భారతదేశ నిజమైన సంస్కృతికి నిదర్శనం అని నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.


40 ఏళ్లకే చాలా మందికి నడుం నొప్పి, ఒళ్లు నొప్పులు అంటూ మూల కూర్చోంటోన్న వేళ 125 ఏళ్ల శివానంద అంత ఫిట్‌గా ఎలా ఉన్నారు? ఆయన ఆరోగ్య రహస్యాలు ఏంటో తెలుసా? 


దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.



  1. శివానంద దేశ చరిత్రలో అత్యంత ఎక్కువ వయసులో పద్మ అవార్డు గ్రహీతగా రికార్డులకెక్కారు.

  2. 1896 ఆగస్టులో ఆయన పుట్టారు. ఈ వయసులోనూ శివానంద.. గంటలపాటు యోగా చేయగలరు. 

  3. ఉదయమే యోగా చేయడం, నూనె లేకుండా ఉకించినవే తినడం, ఇతరులకు సాయం చేయడం వంటి పనులే తనను రోగాల బారిన పడకుండా ఆరోగ్యం ఉంచాయని శివానంద నమ్ముతారు.

  4. స్వామి శివానంద రోజూ ఉదయం 3 గంటలకే నిద్రలేస్తారు.

  5. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా శివానంద ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నారు. ప్రతి రోజూ ఆయన యోగా చేస్తారు. తన పనులు తనే చేసుకుంటారు.

  6. ఎలాంటి ఆడంబరాలు లేకుండా సాదాసీదాగా గడుపుతారు. తేలికైన ఆహారం తీసుకుంటారు.

  7. తనకు 6 ఏళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులు, సోదరిని శివానంద కోల్పోయారు ఆ సమయంలో వారికి అంత్యక్రియలు చేయడానికి నిరాకరించి బ్రహ్మచర్య దీక్షకు సిద్ధమయ్యారు. శివానంద బంధువులు ఆయన్ను ఓ ఆధ్యాత్మిక గురువుకు ఇచ్చేశారు.

  8. బ్రహ్మచర్యం, క్రమశిక్షణ, యోగాకే తన జీవితాన్ని ఆయన అంకితం చేశారు. "ప్రపంచమే తన ఇల్లు, ప్రజలే తన తల్లిదండ్రులు, వారిని ప్రేమించడం, సాయం చేయడమే నా మతం" అని శివానంద నమ్ముతారు. 

  9. దాదాపు మూడు దశాబ్దాలుగా కాశీ ఘాట్‌లో శివానంద యోగాను అభ్యసిస్తూ నేర్పిస్తున్నారు. ప్రజా క్షేమం కోసం తపిస్తూ, గత 50 ఏళ్లుగా కుష్టి రోగులకు కూడా సాయం చేస్తున్నారు. 

  10. ఆరోగ్యకరమైన జీవితానికి యోగా చాలా అవసరమని స్వామి శివానంద చెబుతున్నారు. ఇంద్రియాలు, మెదడు, మనసును కంట్రోల్‌లో పెట్టేందుకు యోగా సహకరిస్తుందన్నారు. ఆధ్యాత్మిక భావనకు యోగాను తొలి అడుగుగా అభివర్ణించారు.


Also Read: PM Narendra Modi: రోజుకు 2 గంటలే మోదీ నిద్రపోతున్నారట- ఎందుకో తెలుసా?


Also Read: Russia Ukraine War: రష్యాపై ఆంక్షలు విధిస్తే భారత్ వణుకుతోంది: బైడెన్