Odisha Train Accident:
డెడ్‌బాడీస్ ఉంచింది ఈ బళ్లోనే..
ఒడిశా రైలు ప్రమాద విషాదం నుంచి అక్కడి ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఈ ప్రమాదం జరిగిన పరిసర గ్రామాల్లోని ప్రజలు ఆ పీడకల నుంచి బయట పడలేదు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే పనిలో అధికారులు సతమతం అవుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా బాలాసోర్‌లోని బహనగ హైస్కూల్‌కి మృత దేహాలను తరలించారు. దీన్ని టెంపరరీ మార్చురీగా మార్చారు. ఆ తరవాత వాటిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. అయినా...ఆ స్కూల్ పిల్లలు మాత్రం బళ్లోకి రావడానికి భయపడిపోతున్నారు. నిన్న మొన్నటి వరకూ శవాల దిబ్బగా ఉన్న ఆ స్కూల్‌లోకి వెళ్లడం కష్టంగా ఉందని అంటున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఈ స్కూల్‌కి పంపేందుకు ఒప్పుకోవడం లేదు. పాఠశాల బిల్డింగ్‌ని కూల్చేసి కొత్తది కట్టాలని డిమాండ్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు ఈ స్కూల్‌ని కూల్చేశారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఆధ్వర్యంలో కూల్చివేశారు. అప్పటికే జిల్లా కలెక్టర్ వచ్చి ఈ స్కూల్‌ని సందర్శించారు. దయ్యాలు తిరుగుతున్నాయన్న భయంతో పిల్లలు బడికి రావడం లేదని తెలుసుకున్నారు. టీచర్లతో మాట్లాడి కూల్చివేసేందుకు అనుమతినిచ్చారు.
"జిల్లా కలెక్టర్ వచ్చి స్కూల్‌ని సందర్శించారు. ఇక్కడ దయ్యాలు తిరుగుతున్నాయని, చనిపోయిన వాళ్ల ఆత్మలు ఉన్నాయని పిల్లలు భయపడుతున్నారు. ఇదంతా మేం కలెక్టర్‌కి వివరించాం. ఆయన వాళ్ల వాదనలు విన్నారు. ఆత్మలు, దయ్యాలు లాంటివి ఏమీ ఉండవని వివరించారు. అదంతా మూఢనమ్మకం అని చెప్పారు. అయినా...ఈ స్కూల్‌ని కూల్చేసి కొత్త స్కూల్ కట్టేందుకు అనుమతినిచ్చారు. ఇలా చేస్తే తప్ప తల్లిదండ్రులు, పిల్లల్లో భయం పోదు అని మేం కూడా చెప్పాం. మా మాటకు గౌరవమిచ్చి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు"
- బహనగ స్కూల్ టీచర్
అటు తల్లిదండ్రులు మాత్రం స్కూల్‌ని ఎందుకు కూల్చివేయాలని డిమాండ్ చేశామో వివరిస్తున్నారు. అన్ని శవాలను పెట్టిన ప్లేస్‌లో పిల్లలు కూర్చుని చదువుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందని చెబుతున్నారు. విద్యార్థులు కూడా తాము ఇక్కడ చదువుకోలేమని అంటున్నారు.
"ఈ స్కూల్ బిల్డింగ్‌లో ఎన్నో మృతదేహాలను ఉంచారు. అంత సులువుగా అది ఎలా మర్చిపోగలం. మాకు ఇక్కడికి రావాలంటేనే భయమవుతోంది. వేరే స్కూల్‌కి మారిపోవాలనుకున్నాం:
- ఓ విద్యార్థి
ప్రమాదానికి కారణమేంటి..?
ఒడిశా రైలు ప్రమాదం ఎలా జరిగిందనే విషయంలో ఇప్పటికే చాలా వాదనలు వినిపించాయి. "కారణమేంటో గుర్తించాం" అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. కానీ...అదేమిటన్నది మాత్రం రివీల్ చేయలేదు. ప్రాథమిక విచారణలో "సిగ్నల్ ఫెయిల్యూర్" అని తేలినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పుడీ వాదననీ కొందరు అధికారులు కొట్టి పారేస్తున్నారు. ఓ సీనియర్ రైల్వే ఇంజినీర్ కీలక విషయాలు చెప్పారు. "జాయింట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్"ని వివరించారు. మెయిన్‌లైన్‌లో వెళ్లేందుకు మాత్రమే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తేల్చి చెప్పారు. కానీ...లోకోపైలట్ ఉన్నట్టుండి లూప్‌లైన్‌లోకి వెళ్లాడని అంటున్నారు ఆ అధికారి. డేటాలాగర్‌ని పరిశీలించిన తరవాతే ఓ ధ్రువీకరణకు వచ్చినట్టు తెలిపారు. Datalogger అంటే సిగ్నలింగ్ సిస్టమ్‌ని మానిటర్ చేసే మైక్రోప్రాసెసర్ బేస్ట్ సిస్టమ్. సిగ్నలింగ్‌కి సంబంధించిన ప్రతి డిటెయిల్ ఇందులో రికార్డ్ అవుతుంది. ఇప్పటికే దీనిపై ఓ కమిటీ విచారణ జరుపుతోంది.
Also Read: Mine Collapsed: ప్రాణాలు తీసిన అక్రమ మైనింగ్, బొగ్గు గనిలో ప్రమాదం - శిథిలాల కింద బాధితులు