NSE కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది! తనకు మార్గనిర్దేశం చేసింది ఓ హిమాలయ యోగి అని, ఆయనో నిరాకార సిద్ధ పురుషుడని NSE మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ (Chitra Ramakrishna) చెప్పడం విడ్డూరంగా అనిపించింది! కెరీర్ వ్యవహారాల్లో ఆయన సలహాలు తీసుకొనేదాన్నని చెప్పడంతో ఎంతకీ ఎవరాయన? ఎలా ప్రభావితం చేశారు? ఎందుకు చేశారో తెలుసుకొనేందుకు ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా సెబీ రూపొందించిన నివేదికలో 'ఆమె వెనుక యోగి' ఎవరో తెలిసినట్టే అనిపిస్తోంది!
వేళ్లన్నీ ఆయన వైపే
ఓ సాధారణ వ్యక్తి ఆనంద్ సుబ్రహ్మణ్యంను తీసుకొచ్చిన చిత్రా రామకృష్ణ ఆయన్ను సీవోవో స్థాయికి చేర్చింది. వ్యక్తిగత సలహాదారుగా నియమించుకుంది. అర్హత లేని ఆ వ్యక్తి చాలా వ్యవహారాలను చక్కబెట్టినట్టు తెలుస్తోంది. చిత్రను ప్రభావితం చేసిన తెరవెనక యోగి ఆయనేనని సెబీకి అందిన ఫొరెన్సిక్ రిపోర్టులో ఉందని సమాచారం. వారిద్దరి ఈ-మెయిల్స్ సంభాషణలు, ఈమెయిల్ ఐడీలు, స్కైప్ ఐడీలు, పంపించిన డాక్యుమెంట్లు ఆయన ఉనికినే సూచిస్తున్నాయని తెలుస్తోంది. మరికొన్ని వాదనలూ తెరపైకి వస్తున్నాయి.
ఆ స్వామీజీ ఇప్పుడు లేరు
తమిళనాడులోని ఓ స్వామీజీ చిత్రకు బాగా తెలుసని సమాచారం. ఇందుకు సంబంధించిన ఓ చిత్రం బయటకు వచ్చింది. చెన్నైలో ఉండే మురుగదిమల్ సెంథిల్ స్వామిగల్ వద్దకు చిత్ర పదేపదే వస్తుండేదట. ఆయన వద్ద ప్రసాదం స్వీకరించి వెళ్లేది. విచిత్రంగా ఆనంద్ సుబ్రహ్మణ్యానికీ ఆయనతో అనుబంధం ఉండటం గమనార్హం. కానీ కొన్నేళ్ల క్రితం ఆ స్వామీజీ చనిపోయారు. కానీ చిత్రకు వచ్చిన వింత ఈమెయిల్స్‌ను చూస్తుంటే సెబీ చెబుతున్న స్వామీజీ ఆయనో కాదో తెలియడం లేదని ఒకరు చెబుతున్నారు.
మెయిల్ ఐడీ ఇదే
ఎన్‌ఎస్‌ఈలో నియామకాలు, లాబీయింగ్‌కు సంబంధించి చిత్రకు rigyajursama@outlook.com అనే ఈమెయిల్ ఐడీ నుంచి మెయిల్స్ వచ్చేవి. పాస్‌వర్డ్ తెలియదు కాబట్టి వాటిని సెంథిల్ స్వామీజీ పంపించారో లేదో తెలియడం లేదు. కానీ చిత్ర బయటి వ్యక్తులతో సమాచారం పంచుకున్నట్టు అనిపించడం లేదని మరొకరు అంటున్నారు. అసలామె ఒకరిని గురువుగా భావిస్తున్నట్టే తెలియదని పేర్కొన్నారు.
ఆనంద్ మెయిల్, నంబర్‌తోనే లింకు
ఫొరెన్సిక్ నివేదికలో 'anand.subramanian9', 'sironmani.10' వంటి ఐడీలను ఆనంద్ సుబ్రహ్మణ్యం ఉపయోగించే ఎన్‌ఎస్‌ఈ డెస్క్‌టాప్‌లో గుర్తించినట్టు తెలిసింది. స్కైప్ డేటాబేస్ ద్వారా ఆ ఖాతా 'rigyajursama@outlook.com' ఈమెయిల్ ఐడీ, సుబ్రహ్మణ్యం మొబైల్ నంబర్‌కు లింకై ఉన్నట్టు సమాచారం. పైగా చిత్రకు ఈమెయిల్స్ ద్వారా పంపించిన డాక్యుమెంట్లకు ఆథర్ పేరు ఆనంద్ సుబ్రహ్మణ్యంగానే సూచిస్తున్నాయి. వాస్తవంగా ఎన్‌ఎస్‌ఈలోని సమాచారాన్ని సంస్థలోని మరొకరికి పంపిస్తే నేరం కాదు. ఆ ప్రకారంగా చూసుకుంటే ఆ యోగి, ఈ ఆనంద్ ఒక్కరే అనిపిస్తోంది. కానీ చిత్ర మాత్రం ఆ వ్యక్తి ఆనంద్ కాడని మరొకరని చెబుతున్నారు. ఇప్పటికైతే అన్నీ వేళ్లూ 'ఆనంద్ సుబ్రహ్మణ్యం' వైపే ఉన్నాయి. విచారణలో ఏమైనా వివరాలు తెలిస్తేనే ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో బయటపడుతుంది!
Also Read: దేశం విడిచి పారిపోకుండా చిత్రా రామకృష్ణపై లుక్‌ఔట్ నోటీసులు.. మరో ఇద్దరి పైనా
Also Read: చిత్రా రామకృష్ణ నివాసంపై ఐటీ దాడులు- ఇంతకీ ఎవరా అజ్ఞాత యోగి!