Yasin Malik: జమ్ముకశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు మరణ శిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డిమాండ్‌ చేసింది. 2017లో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడంతోపాటు ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారం అందించిన కేసుల్లో యాసిన్‌ మాలిక్‌ను దోషిగా దిల్లీ కోర్టు గత వారం నిర్ధరించింది. శిక్షలపై బుధవారం తీర్పు వెల్లడించనుంది.







దీంతో యాసిన్‌ మాలిక్‌కు మరణ శిక్ష విధించాలని కోర్టును ఎన్‌ఐఏ కోరింది.  యాసిన్‌ మాలిక్‌ తరుఫున వాదించేందుకు కోర్టు నియమించిన అమికస్ క్యూరీ, ఆయనకు జీవిత ఖైదు విధించాలని సూచించింది. 


దోషిగా తేల్చిన కోర్టు


ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశారన్న కేసులో జమ్ముకశ్మీర్​ లిబరేషన్​ ఫ్రంట్​ (జేకేఎల్)​ అధినేత యాసిన్​ మాలిక్​ను ఇటీవల దోషిగా తేల్చింది దిల్లీ ఎన్ఐఏ కోర్టు. ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ ఈ తీర్పు చెప్పారు.  


జ‌మ్ముకశ్మీర్‌లో సంఘ విద్రోహ కార్య‌కలాపాలు న‌డిపేందుకు నిధులు స‌మీక‌రించిన‌ట్లు యాసిన్ మాలిక్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2017కు సంబంధించిన ఈ కేసులో మాలిక్​పై దిల్లీ కోర్టులో ఇటీవల అనుబంధ అభియోగ పత్రం​ దాఖలు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ. నేరాభియోగం న‌మోదైన నేప‌థ్యంలో మాలిక్ క్ష‌మించాల‌ని కోరారు. 


టెర్రర్‌ ఫండింగ్‌ కేసులో తనపై నమోదైన అన్ని అభియోగాలను యాసిన్‌మాలిక్‌ అంగీకరించాడు. యాసిన్ మాలిక్ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవాలని అతని ఆస్తులకు సంబంధించి అఫిడవిట్ ఇవ్వాలని కోర్టు ఎన్‌ఐఎని ఆదేశించింది.


ఈ కేసుపై విచారణ జరపవలసిన జడ్జి రాకేశ్ కుమార్ శర్మ సెలవులో ఉండటంతో జడ్జి ప్రశాంత్ కుమార్ విచారణ జరిపారు. కశ్మీరులో ప్రశాంతతకు భంగం కలిగించడం, దేశద్రోహం, దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, నేరపూరిత కుట్రకు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు  పాల్పడటం వంటి నేరారోపణలపై విచారణ జరిగింది. 


ఈ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్​, హిజ్బుల్​ ముజాహిద్దిన్​ చీఫ్​ సయ్యద్​ సలావుద్దీన్​ సహా పలువురు వేర్పాటువాద నేతలపై ఎన్​ఐఏ ఛార్జ్​షీట్​ దాఖలు చేసింది. 


Also Read: Goa News: దొంగల నయా ట్రెండ్- ఇల్లంతా దోచేసి, లవ్ లెటర్ రాసి పరార్!


Also Read: Baramulla Encounter: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్- ముగ్గురు పాక్ ఉగ్రవాదులు హతం