Baramulla Encounter: జమ్ముకశ్మీర్‌ బారాముల్లా జిల్లాలో బుధవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే ఉగ్రవాదులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ పోలీసు వీరమరణం పొందారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్‌ ఐజీపీ తెలిపారు. 










ఇదీ జరిగింది


బారాముల్లాలోని క్రీరి ప్రాంతంలో నజీభట్‌ క్రాసింగ్‌ వద్ద ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని బుధవారం భద్రతా దళాలకు సమాచారం వచ్చింది. భద్రతా దళాలు, పోలీసుల సంయుక్త బృందం కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి.


నక్కి ఉన్న ఉగ్రవాదులు.. బలగాలను చూసి వారిపై కాల్పులు జరిపాయి. దీంతో బలగాలు వారిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పాకిస్థాన్ జైషే మహ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ జేకేపీ జవాన్‌ వీరమరణం పొందారు.


ఘటన జరిగిన ప్రాంతాన్ని బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం కూంబింగ్‌, సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుందని కశ్మీర్ ఐజీపీ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఐజీపీ తెలిపారు. అమాయకులైన యువకుల్ని ఉగ్రవాదంలోకి లాగి వారి జీవితాలనే కాకుండా దేశాన్ని నాశనం చేయడానికి పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.


Also Read: Hardik Patel: భాజపాలో చేరడం ఓ ఆప్షన్- కాంగ్రెస్ కన్నా ఆప్ బెస్ట్: హార్దిక్ పటేల్


Also Read: Rajya Sabha Elections 2022: కాంగ్రెస్‌కు కపిల్ సిబల్ గుడ్‌బై- ఎస్‌పీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికల బరిలో!