Navjot Sidhu: కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ఆశలన్నీ అడియాశలుగానే మిగిలిపోయాయి. పంజాబ్‌కు ముఖ్యమంత్రి అవుదామని కలలకు కన్న మాజీ క్రికెటర్ చివరికి అదే రాష్ట్రంలోని పటియాలా కేంద్ర కారాగారంలో గుమస్తాగా మారారు. 34 ఏళ్ల నాటి కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది.
ఇదే పని
గుమస్తా బాధ్యతల్లో భాగంగా సుదీర్ఘంగా ఉండే కోర్టు తీర్పులను ఏ విధంగా వివరించాలి? జైలు రికార్డులను ఏ విధంగా తయారు చేయాలి? అనే అంశాలపై సిద్ధూకు మూడు నెలలపాటు శిక్షణ ఇస్తారు. గుమస్తాగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి 90 రోజులకు సిద్ధూకు వేతనం చెల్లించరు. శిక్షణ పూర్తయిన తర్వాత ఆయనకు రోజుకు రూ.40 నుంచి రూ.90 వరకు వేతనం చెల్లిస్తారు. ఆయన నైపుణ్యం ఆధారంగా ఈ వేతనాన్ని నిర్ణయిస్తారు.
ఆయన సంపాదనను ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఆయన హై ప్రొఫైల్ ఖైదీ కాబట్టి బ్యారక్స్‌లోనే గుమస్తాగా పని చేస్తారు. జైలు ఫైళ్ళను ఆయన ఉండే బ్యారక్స్‌కు పంపిస్తారు. ఆయనను తన సెల్ నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించరు. జైల్లో ఆయనకు ఖైదీ నంబర్ 137683 ఇచ్చారు. సిద్ధూకి కాలేయానికి సంబంధించిన సమస్యలున్నాయి. గోధుమలతో తయారైన ఆహారం సిద్ధూకి పడదని ప్రత్యేక భోజనం కోసం సిద్ధూ జైలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు అధికారులు అంగీకరించారు.
పని వేళలు
సిద్ధూ మంగళవారం నుంచి గుమస్తాగా పని చేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఆయన పని చేస్తారు.
ఇదే కేసు
గతంలో సిద్ధూకు, గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడిని సిద్ధూ క్షణికావేశంలో తలపై కొట్టడంతో ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో సుప్రీం కోర్టు మే 19న తుది తీర్పును వెల్లడించింది. ఈ నెల 20న ఆయన పాటియాలా ట్రయల్ కోర్టు సమక్షంలో లొంగిపోయారు.
Also Read: Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!
Also Read: Rajya Sabha Polls 2022: భార్యను పక్కన పెట్టిన అఖిలేశ్ యాదవ్- కీలక నిర్ణయం!