Karti Chidambaram: తనపై నమోదైన కేసులన్నీ బోగస్ అని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఆరోపించారు. తాను కనీసం ఒక చైనా జాతీయుడికి కూడా వీసా ఇప్పించలేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రధాన కార్యాలయానికి కార్తీ చిదంబరం గురువారం హాజరయ్యారు. 263 మంది చైనీయులకు అక్రమంగా వీసాలు మంజూరవడానికి సహాయపడినట్లు వచ్చిన ఆరోపణలపై అధికారులు కార్తీని ప్రశ్నిస్తున్నారు.


కార్తి చిదంబరం సన్నిహితుడు ఎస్ భాస్కర రామన్‌ను ఈ కేసులో సీబీఐ మే 17న అరెస్టు చేసింది. ఈ కేసులో మొత్తం మీద నలుగురిని అరెస్టు చేసింది. కార్తి చిదంబరం బెయిలు షరతుల ప్రకారం ఆయన భారత దేశానికి చేరుకున్న 16 గంటల్లోగా సీబీఐ సమక్షంలో హాజరు కావలసి ఉంది. 


ఓ సీబీఐ అధికారి మాట్లాడుతూ, కార్తి చిదంబరానికి తాము సమన్లు జారీ చేయలేదన్నారు. భారత దేశానికి చేరుకున్న 16 గంటల్లోగా సీబీఐ సమక్షంలో హాజరుకావాలని కోర్టు ఆదేశించిందని చెప్పారు. 


ఇలా జరిగింది


వీసా కుంభకోణంలో కార్తీ పి చిదంబరం, ఎస్ భాస్కరరామన్, వికాస్ మఖారియా, మాన్సా (పంజాబ్) ఆధారిత ప్రైవేట్ కంపెనీ, ఎంఎస్ తల్వాండి సబో పవర్ లిమిటెడ్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిపై సీబీఐ కేసు నమోదు చేసింది.


మాన్సా వద్ద ఉన్న ప్రైవేట్ కంపెనీ థర్మల్ పవర్ ప్లాంట్‌ను స్థాపించే ప్రక్రియలో ఉందని, ప్లాంట్ స్థాపనను చైనా కంపెనీకి అవుట్‌సోర్స్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. చైనీస్ కంపెనీ అధికారులకు కేటాయించిన 263 ప్రాజెక్ట్ వీసాలను తిరిగి ఉపయోగించడానికి అనుమతిని మంజూరు చేయడంలో అక్రమాలు జరిగాయని సీబీఐ కేసు పెట్టింది.



వీసాల జారీకి ఓ కంపెనీ తరఫున ఉన్న పరిమితులకు అడ్డు రాకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సంబంధిత చైనా సంస్థలోని 263 ప్రాజెక్ట్​ వీసాలను గడువు ముగిసినా మళ్లీ ఉపయోగించుకునేలా చేశారు. సాధారణంగా వీసాను పునర్వినియోగించుకోవాలంటే హోంమంత్రి అనుమతి కావాల్సి ఉంటుంది. అప్పటి హోంమంత్రి వీటిని అనుమతించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రూ.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.                                                 "
-సీబీఐ అధికారులు



చెన్నై, ముంబయి, కర్ణాటక, ఒడిశా, పంజాబ్, దిల్లీ ఇతర ప్రాంతాలతో సహా దాదాపు 10 చోట్ల ఇటీవల సోదాలు జరిపిన సీబీఐ భాస్కర్ రామన్‌ను అరెస్టు చేసింది.


Also Read: Delhi's Thyagraj Stadium: కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు స్టేడియం ఖాళీ చేయించిన ఐఏఎస్!


Also Read: Supreme Court: స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు- సెక్స్ వర్కర్లను వేధించొద్దు: సుప్రీం కోర్టు