Maratha Quota Row: 


మరాఠా రిజర్వేషన్‌లపై ఆందోళనలు..


మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్‌ల (Maratha Reservation Protest) అంశం అలజడి రేపుతోంది. పలు చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మనోజ్ జరంగె పాటిల్ ( Manoj Jarange Patil) నేతృత్వంలో ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఆయన మద్దతుదారులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. ఉద్యమం మొదలైనప్పుడు ప్రశాంతంగానే ఉన్నప్పటికీ..ఇది క్రమక్రమంగా హింసాత్మక ఘటనలకు దారి తీస్తోంది. ఆందోళనకారులు ఎమ్మెల్యేల ఇళ్లను తగలబెట్టడం ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. పుణే-బెంగళూరు హైవేని బ్లాక్ చేశారు. కున్బీ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ల ద్వారా OBC కోటా కింద రిజర్వేషన్‌లు ఇస్తామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ఇప్పటికే ప్రకటించారు. అయితే...ఈ నిర్ణయాన్ని ఆందోళకారులు వ్యతిరేకించారు. కచ్చితంగా తమకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఈ క్రమంలోనే శిందే ఆల్ పార్టీ మీటింగ్‌కి పిలుపునిచ్చారు. మరాఠా రిజర్వేషన్‌ల అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశాలకు పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. అయితే...ఈ మీటింగ్‌కి ఉద్దవ్ బాల్ థాక్రే శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రేకి మాత్రం పిలుపు అందలేదు. ఈ విషయం స్వయంగా ఆయనే వెల్లడించారు. అటు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. ఆందోళనకారులు పలు చోట్ల కార్‌లకు నిప్పు పెట్టారు. కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. NCP ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి హసన్ ముష్రీఫ్ కార్‌ని ధ్వంసం చేశారు. పుణె-బెంగళూరు నేషనల్ హైవేపై టైర్లు తగలబెట్టి రోడ్‌ని బ్లాక్ చేశారు. ఈ ఘటనలో దాదాపు 400-500 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 






అప్రమత్తమైన పోలీసులు..


ఈ అల్లర్లకు బాధ్యులైన 10 మందిని ఇప్పటికే గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. మనోజ్‌కి మద్దతుగా ఛత్రపతి శివాజీ మార్కెట్ యార్డ్‌ని ఒక రోజు పాటు బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు ఆందోళనకారులు. లా అండ్ ఆర్డర్ డీజీపీ ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నారు. 99 మందిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే అప్రమత్తమైన ప్రభుత్వం మరాఠా రిజర్వేషన్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఓ సారి సమావేశం కూడా పూర్తైంది. చట్టానికి లోబడి కచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని ఏక్‌నాథ్ శిందే స్పష్టం చేశారు. అర్హులైన వారికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తామని వెల్లడించారు. కేబినెట్ మీటింగ్ తరవాత తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ కమిటీ కోటి 72 లక్షల రికార్డులు పరిశీలించింది. కున్‌బీ రికార్డ్స్ కింద (Kunbi Records) వీళ్లకు సర్టిఫికేట్స్ ఇస్తామని చెబుతోంది ప్రభుత్వం. మరాఠా రిజర్వేషన్‌లు రద్దు చేయాలనే అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అందులో కొన్ని సవరణలు చేసే అవకాశాలున్నాయి. మరాఠా రిజర్వేషన్‌లు ఇవ్వడంలో తమకు ఎలాంటి సమస్య లేదని, అయితే..చట్టపరంగా అన్నీ ఆలోచించి ఆ పరిధిలోనే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తోంది. 


Also Read: సిలిండర్ ధరని భారీగా పెంచిన కేంద్రం, ఏయే ఏరియాల్లో రేట్ ఎంత ఉందంటే?