Delhi Air Quality Index: దేశ రాజాధాని ఢిల్లీలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. గాలి నాణ్యత బుధవారం చాలా పేలవంగా ఉందని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(Air Quality Index) స్పష్టం చేస్తోంది. వరుసగా ఐదవ రోజు బుధవారం దారుణంగా గాలి నాణ్యత దారుణంగా ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) వివరాల మేరకు (AQI) గాలి నాణ్యత 373గా నమోదైంది. మంగళవారం వాయు నాణ్యత (AQI) 350గా నమోదవడంతో జాతీయ రాజధాని, దాని శివారు ప్రాంతాలను పొగమంచు చుట్టుముట్టింది. 


సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) వివరాల మేరకు గాలి నాణ్యత సోమవారం 347, ఆదివారం 325గా నమోదైంది. సోమవారం ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో AQI స్థాయి 'తీవ్ర' జోన్‌లోకి పడిపోయింది. ఢిల్లీకి చెందిన జహంగీర్‌పురి ఆదివారం 'ప్రమాదకర' విభాగంలో సీజన్‌లో అత్యధిక AQIని 566 వద్ద నమోదు చేసింది. చాలా కాలంగా ఢిల్లీ విపరీమైన వాయ కాలుష్యంతో సతమతమవుతోంది. ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.


ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీ కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్‌లను దాఖలు చేయాలని ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. వారం రోజుల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఐదు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను నవంబర్ 7న వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తులు సుధాన్షు ధులియా, పీకే మిశ్రా తెలిపారు.


ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణం పంట వ్యర్థాలను తగులబెట్టడమేనని ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) నుంచి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలోనూ ఆదేశించింది. 


CNG, ఎలక్ట్రిక్ బస్సులకు మాత్రమే అనుమతి
హర్యానా నుంచి దేశ రాజధానికి ఎలక్ట్రిక్, సీఎన్‌జీ లేదా బీఎస్-6 డీజిల్‌ వాహనాలు నడపాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌ నుంచి ఎన్‌సీఆర్ ప్రాంతాలకు వచ్చే వాహనాలు కూడా ఎలక్ట్రిక్, సీఎన్‌జీ లేదా బీఎస్-6 డీజిల్‌ వాహనాలు ఉండాలని సూచించింది. ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఏర్పడే వాయు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లకు జారీ చేసిన సర్క్యులర్లు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పలు సామాజిక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 


ముంబైలో ఎలా ఉందంటే?
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గాలి నాణ్యత 173గా ఉంది. వాయు నాణ్యత సూచి 0-50 మధ్య ఉంటే "మంచిది", 51-100 "సంతృప్తికరమైనది", 101-200 "మితమైన", 201-300 "పేలవమైనది", 301-400 "చాలా పేలవమైనది", 401-500 "తీవ్రమైనది"గా పరిగణిస్తారు. 500 కంటే ఎక్కువ AQI "తీవ్రమైన ప్లస్" విభాగంలోకి వస్తుంది.