Commercial LPG Price Hike: 


కేంద్ర ప్రభుత్వం వ్యాపారులకు (LPG Price Hike) ఝలక్ ఇచ్చింది. కమర్షియల్ సిలిండర్ ధరల్ని ఏకంగా రూ.101 మేర పెంచింది. దేశవ్యాప్తంగా ఈ ధరలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. ఈ పెంపుతో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రిటైల్ ధర ఢిల్లీలో రూ.1833కి పెరిగింది. అంతకు ముందు ఈ ధర రూ.1731గా ఉండేది. ముంబయి, కోల్‌కతా, చెన్నైల్లోనూ ధరల్లో మార్పులు వచ్చాయి. వరుసగా రెండోసారి ఇలా ధరను పెంచేసింది కేంద్రం. ఒక్క అక్టోబర్ నెలలోనే వాణిజ్య సిలిండర్ ధర రూ.209 మేర పెరిగింది. అంతకు ముందు ఆగస్టు, సెప్టెంబర్‌లో రూ.250 మేర తగ్గించింది. ప్రతి నెలా మొదటి రోజునే డొమెస్టిక్‌తో పాటు కమర్షియల్ సిలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. ఇక 14.2 కిలోల వంట గ్యాస్ ధర ఢిల్లీలో రూ.903 గా ఉంది. కోల్‌కతాలో రూ.929, ముంబయిలో రూ.902.50, చెన్నైలో రూ.918.50గా ఉన్నాయి. 







ఎల్‌పీజీ సిలిండర్ల సబ్సిడీపై ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న రూ.200 సబ్సిడీని రూ.300కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. Pradhan Mantri Ujjwala Yojana స్కీమ్‌లో భాగంగా ఎల్‌పీడీ సిలిండర్లపై సబ్సిడీ ఇస్తోంది కేంద్రం.


"కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అందులో కోట్లాది మంది మహిళలకు ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకున్నాం. LPG సిలిండర్లపై ఇచ్చే సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కి పెంచాలని నిర్ణయించాం"


- అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి 


వ్యాపారుల హడల్..


ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY)ని 2016లో ప్రారంభించింది మోదీ (PM Modi) సర్కార్. కట్టెల పొయ్యితో వంట చేయడాన్ని తగ్గించి, సిలిండర్లు రాయితీ కింద మహిళలకు అందించాలని ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా వాళ్ల ఆరోగ్యాన్ని కాపాడినట్టు అవుతుంది. దాంతో పాటు కాలుష్యమూ తగ్గుతుంది. అందుకే సిలిండర్‌పై రాయితీ ఇచ్చి వాళ్లకు అందుబాటు ధరలో ఉంచుతోంది. ఇప్పుడు సబ్సిడీని పెంచడం వల్ల కోట్లాది మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు అనురాగ్ ఠాకూర్.  ప్రస్తుతానికి ఉజ్వల లబ్ధిదారులు 14.2 కిలోల సిలిండర్‌కి రూ. 703 చెల్లిస్తున్నారు. మార్కెట్ ధర రూ.903గా ఉంది. ఇప్పుడు సబ్సిడీ పెంపుతో రూ.603 చెల్లిస్తే సరిపోతుంది. వాణిజ్య సిలిండర్ ధరలు మాత్రం పెరుగుతూ పోతుండటం వ్యాపారులను హడలెత్తిస్తోంది. ఇటీవలే భారీగా పెంచింది. ఇప్పుడు మరోసారి ఏకంగా రూ.101 పెంచి మరింత షాక్ ఇచ్చింది. 


Also Read: యాక్సిడెంట్ అయిన కార్‌లో మందు బాటిల్స్, ఎగబడి ఎత్తుకెళ్లిన స్థానికులు - వైరల్ వీడియో