Viral News: ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లో వింత ఘటన చోటుచేసుకుంది కేవలం ఐ బ్రోస్ షేప్ చేయించుకున్నందుకు ఓ మహిళ భర్త ఆగ్రహానికి గురైంది. తనకు ఇష్టం లేకుండా ఐ బ్రోస్ చేయించుకన్న భార్యకు ఓ ముస్లిం భర్త ఫోన్‌లోనే త్రిపుల్ తలాఖ్ చెప్పాడు. పెళ్లి బంధం నుంచి విడాకులు ఇస్తున్నానని, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చంటూ చెబుతూ విడాకులు ఇచ్చాడు. ఈ ఘటనతో ఆమె తీవ్ర వేదనకు లోనైన మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది.


వివరాలు.. కాన్పూర్‌కు చెందిన గుల్సాయిబా, సలీమ్‌కు 2022 జనవరిలో పెళ్లి చేసుకున్నారు. జీవనోపాధి కోసం 2023 ఆగస్టు 30వ తేదీన సలీం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అప్పటి నుంచి గుల్సాబాయిని అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించేవారు. నానా మాటలు అనేవారు. అయినా వాటన్నింటిని ఆమె మౌనంగానే భరించేది. దేనికైనా ఓ హద్దు ఉంటుంది కాదా. తనను అత్తింటి వారు పెడుతున్న వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించింది. తనను అత్తింటి వారు ఎలా వేధిస్తారో చెప్పుకొని రోదించింది. తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించింది. 


తన భర్త పాతకాలపు పద్ధతులు పాటిస్తాడని, వేసుకునే దుస్తులపైనా అభ్యంతరాలు చెబుతాడని గుల్సాబాయి ఆరోపించింది. అక్టోబర్ 4న తనకు సౌదీ అరేబియా నుంచి వీడియో కాల్ చేశాడని వివరించింది. ఆ సందర్భంగా తన ఐ బ్రోస్ చూసి, వాటి గురించి ప్రశ్నించాడని తెలిపింది. ఆ కను బొమ్మలు సరిగా లేవని, వాటిని షేప్‌కు తీసుకురావడానికే చేయించానని వివరణ ఇచ్చినా ఆయన ఆగ్రహిస్తూనే ఉన్నాడని ఫిర్యాదు చేసింది. సలీం తనను బెదిరించాడని, తాను వద్దని అభ్యంతరం చెప్పినా ముందుకు అడుగు వేశావంటూ మండిపడ్డాడని పేర్కొంది. 


తన మాటలు లెక్క చేయకుండా ఐ బ్రోస్ షేప్ చేయించుకున్నావంటూ ఆగ్రహించిన సలీం.. ఈ రోజు నుంచి పెళ్లి బంధం నుంచి ఆమెకు విముక్తి ఇస్తానని చెప్పి మూడు సార్లు తలాఖ్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడని గుల్సాబాయి వివరించింది. ఎన్నిసార్లు మళ్లీ ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదని తెలిపింది. ఏడాది క్రితమే తనకు పెళ్లి అయ్యిందని బాధితురాలు వాపోయింది. ఈ ఏడాదిలో భర్త సలీం తనను చాలా సార్లు వేధించాడని, అగౌరవ పరిచాడని పేర్కొంది. ఇప్పుడు ఐ బ్రోస్ నెపంతో ట్రిపుల్ తలాక్ చెప్పారని, తన జీవితాన్ని నాశనం చేసిన సలీంపై చర్యలు తీసుకుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గుల్సాబాయి భర్త, అత్త సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


బారాబంకీలో ఇదే తరహా ఘటన
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. బారాబంకీకి చెందిన బాధితురాలికి ఫిరోజాబాద్‌ జిల్లాకు చెందిన మహ్మద్‌ షకీల్‌తో 2020లో వివాహమైంది. కొంతకాలం తర్వాత షకీల్‌ సౌదీ అరేబియా వెళ్లిపోయాడు. అత్తింటి వారు కట్నం తేవాలంటూ వేధించి ఆమెను బలవంతంగా పుట్టింటికి పంపారు. పుట్టింట్లో ఉంటూ ఆమె ఓ ప్రైవేట్‌ స్కూలులో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ 28న సౌదీ అరేబియా నుంచి సొంతూరుకు చేరుకున్న షకీల్‌.. జూలై 10న బాధితురాలి వద్దకు వచ్చాడు. తనతో రావాలని కోరాడు. వెంటనే రాలేనని చెప్పడంతో ఆరు రోజుల అనంతరం తిరిగి సొంతూరుకు వెళ్లిపోయాడు. ఆగస్ట్‌ 24న తరగతి గదిలో ఉండగా వచ్చి విద్యార్థుల ఎదుటే తనకు మూడు సార్లు తలాక్‌ చెప్పాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు మేరకు కొత్వాలీ సిటీ పోలీసులు షకీల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.