Maratha Reservation Quota: రిజర్వేషన్ల కోసం మహారాష్ట్రలో మరాఠీలు రోడ్డు ఎక్కారు. మరాఠా కోటా రిజర్వేషన్ల ఉద్యమంతో మహారాష్ట్ర అట్టుడుకుతోంది. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళనకారులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. బీజేపీ-శివసేన సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్కడికక్కడ జాతీయ రహదారులు, రైల్వే ట్రాకులను దిగ్బంధించారు. ముంబై-బెంగళూరు హైవేను రెండు గంటలపాటు దిగ్బంధించటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ప్రభుత్వ, బీజేపీ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. 


రిజర్వేషన్ల అంశంపై ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్‌ చేస్తూ షోలాపూర్‌లో సామాజిక కార్యకర్తలు రైలు పట్టాలను దిగ్బంధించారు. జల్నా జిల్లా ఘన్‌సావంగి వద్ద కొందరు వ్యక్తులు పంచాయతీ సమితి కార్యాలయానికి నిప్పుపెట్టారు. మంత్రాలయలోని నారిమన్‌ పాయింట్‌ వద్ద వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మరాఠా ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. హింగోలి జిల్లాలో బీజేపీ కార్యాలయాన్ని ఆందోళనకారులు తగులబెట్టారు. పుణే, శివగావ్‌, అహ్మద్‌నగర్‌ జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. పుణే-బెంగళూరు రహదారిపై ఆందోళనకారులు టైర్లకు నిప్పుపెట్టారు. 


రిజర్వేషన్ల కోసం వారం రోజులుగా దీక్ష చేస్తున్న  సామాజిక కార్యకర్త మనోజ్‌ జరంగే పాటిల్‌ ఆరోగ్యం క్షీణించింది. దీనికి తోడు జరంగే పాటిల్‌‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు సందీప్‌, ప్రకా సోలంకి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మరాఠీల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎమ్మెల్యే ప్రకాశ్‌ సోలంకి ఇంటిని ముట్టడించిన నిరసనకారులు దాడికి దిగారు. ఇంటి ముందున్న వాహనాలకు తగులపెట్టి ఆతర్వాత ఇంటికి నిప్పు పెట్టారు. మరోవైపు ఉద్యమంలో పాల్గొన్న యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.  దాంతో మహారాష్ట్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో స్థానికంగా 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మరాఠా రిజర్వేషన్‌ డిమాండ్‌కు మద్దతుగా సీఎం షిండే వర్గీయులైన హింగోలి ఎంపీ హేమంత్‌ పాటిల్‌, నాసిక్‌ ఎంపీ హేమంత్‌ గాడ్సే రాజీనామా చేశారు.


మరాఠ్వాడా ప్రాంతంలోని మరాఠీలకు కుంబీ కుల సర్టిఫికెట్స్‌ జారీ చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి సందీప్‌ షిండే కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించింది. మరాఠ్వాడా ప్రాంతంలోని మరాఠాలకు కుంబీ కుల సర్టిఫికెట్స్‌ జారీ ప్రారంభిస్తామని అధికారికంగా ప్రకటించింది. రిజర్వేషన్లపై గతంలో తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు 2021లో కొట్టేసిన సంగతి తెలిసిందే. దాంతో మరాఠా కమ్యూనిటీ ప్రజలకు ప్రభుత్వం కుంబీ సర్టిఫికెట్లు ఇవ్వాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చింది.


మరాఠీలు అందరికి న్యాయం చేయాల్సిందే!
మరాఠ్వాడా ప్రాంతంలోని మరాఠీలకు కుంబీ కుల సర్టిఫికెట్స్‌ జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనపై సామాజిక కార్యకర్త మనోజ్‌ జరంగే పాటిల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరాఠీలోని కొన్ని వర్గాలకు మాత్రమే వర్తించేలా రిజర్వేషన్లు కల్పించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్నాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అది అసంపూర్ణమైన రిజర్వేషన్‌ అన్నారు. దానిని ఎంతమాత్రం అంగీకరించేది లేదన్నారు. రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి చట్టాన్ని చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మరాఠీలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారని, రాష్ట్రమంతటా వర్తించేలా రిజర్వేషన్లు ప్రకటించాలని జరాంగే అన్నారు. రిజర్వేషన్ల కోసం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, గ్రామాల్లోకి రాకుండా రాజకీయ నాయకులను అడ్డుకోవటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.