Manipur Viral Video Case:
సుప్రీంకోర్టు విచారణ..
మణిపూర్ వైరల్ వీడియో కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న కేంద్ర విజ్ఞప్తిని సుప్రీంకోర్టు విచారించనుంది. ఇప్పటికే బాధిత మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. వాటిని సుమోటోగా పరిగణించిన సర్వోన్నత న్యాయస్థానం...నిష్పక్షపాతంగా విచారణ కొనసాగించాలని ఆదేశించింది. అయితే...బాధితులు తమ పిటిషన్‌లో కీలక విషయాలు ప్రస్తావించారు. తమ పేర్లు బయటకు రాకుండా X,Yలుగా పరిగణించిన కేసు విచారించాలని కోరారు. కోర్టు డాక్యుమెంట్స్‌లో తమ పేర్లు ఇలానే ఉండాలని విజ్ఞప్తి చేశారు. అంతే కాదు. ఈ కేసు విచారణకు ప్రత్యేకంగా ఓ సిట్ కమిటీని ఏర్పాటు చేయాలని, IG ర్యాంక్ పోలీస్ అధికారితో విచారణ జరిపించాలని కోరారు. దీంతో పాటు కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ చేశారు. తమకు భద్రతనివ్వాలనీ అడిగారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ కేసుని CBIకి బదిలీ చేసింది. గత వారమే సుప్రీంకోర్టు ఈ కేసుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇది కచ్చితంగా రాజ్యాంగ వైఫల్యమే అని మండి పడింది. మణిపూర్‌లోని మహిళలకు రక్షణ కల్పించాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కేంద్రాన్ని ఆదేశించారు. బాధితులతో పాటు కేంద్రం కూడా ఈ కేసుని వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసింది.
"వైరల్ అయిన వీడియోలు చూసి చలించిపోయాం. ఎంతో ఆవేదనకు గురయ్యాం. ప్రభుత్వం రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయమిది. ఇలాంటివి జరగడం ఆమోదయోగ్యం కాదు. ఒకవేళ ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైతే మేమే ఆ పని చేస్తాం. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలుసుకునే బాధ్యత మాపై ఉంది. అంత దారుణానికి పాల్పడిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే"
- చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్
మణిపూర్ వైరల్ వీడియో కేసులో సీబీఐ ఇప్పటికే FIR నమోదు చేసింది. రెండ్రోజుల క్రితమే సుప్రీంకోర్టులో కేంద్రం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇకపై ఈ కేసుని CBI విచారిస్తుందని అందులో పేర్కొంది. ఇప్పుడు అధికారికంగా FIR నమోదు చేసింది. ఈ నెల 27వ తేదీన కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అఫిడవిట్ సమర్పించింది. ఈ కేసుని సీబీఐ విచారిస్తుందని వెల్లడించింది. మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలను సహించేది లేదని తేల్చి చెప్పింది. వీలైనంత వేగంగా ఈ కేసుని విచారించేలా చూడాలని కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టుని విజ్ఞప్తి చేసింది. మణిపూర్‌లో కాకుండా వేరే రాష్ట్రానికి కేసుని బదిలీ చేసి విచారణ కొనసాగించాలని కోరింది. మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో ఇటీవలే వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. మణిపూర్ ప్రభుత్వానికీ నోటీసులు పంపింది. వైరల్ వీడియో కేసులో నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. ఇప్పటి వరకూ ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
Also Read: జైపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో కాల్పులు- ఒక ఏఎస్‌ఐ, ముగ్గురు ప్రయాణికులు మృతి