Maharashtra NCP Political Crisis: 



స్పందించిన శరద్ పవార్..


మహారాష్ట్రలో జరిగిన పరిణామాలపై ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. రెండ్రోజుల క్రితమే ప్రధాని మోదీ NCPని ఓ అవినీతి పార్టీ అని విమర్శించారని, ఇంతలోనే అదే పార్టీకి చెందిన లీడర్స్‌ని చేర్చుకున్నారని విమర్శించారు. కొంత మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవి దక్కడం సంతోషంగానే ఉందని అన్నారు. శిందే ప్రభుత్వంతో చేరి తమపై ఉన్న కేసులన్నింటినీ మాఫీ చేయించుకున్నారని సెటైర్లు వేశారు. 


"రెండ్రోజుల క్రితమే ప్రధాని మోదీ మాది అవినీతి పార్టీ అని విమర్శించారు. ఇప్పుడదే పార్టీ లీడర్స్‌ని ప్రభుత్వంలోకి ఆహ్వానించారు. అజిత్ పవార్ వెన్నుపోటు పొడిచాడు. నాతో కనీసం మాట్లాడలేదు. ఈ సారి నేను ఎలాంటి గూగ్లీ వేయలేదు. నాకు చాలా మంది నేతల నుంచి కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. నాకిదేమీ కొత్త కాదు. 1980లో నా పార్టీ 58 మంది ఎమ్మెల్యేలతో లీడ్‌లో ఉంది. ఆ తరవాత అందరూ వెళ్లిపోయారు. కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే నాకు మిగిలారు. అయినా నేను వెనకడుగు వేయలేదు. ఆ సంఖ్యను పెంచుకున్నాను"


- శరద్ పవార్, ఎన్‌సీపీ చీఫ్ 






జులై 6వ తేదీన తదుపరి కార్యాచరణపై పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు శరద్ పవార్. ఆ రోజు అందరి నేతలతోనూ చర్చించనున్నారు. పార్టీలో చేయాల్సిన మార్పులపైనా ప్రస్తావించనున్నట్టు వెల్లడించారు. 


అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు..


మహారాష్ట్ర డిప్యుటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. NCPలోని అందరు ఎమ్మెల్యేలూ శిందే వైపే ఉన్నారని తేల్చి చెప్పారు. అంతే కాదు. ఎన్‌సీపీ పార్టీ పేరు, గుర్తుతోనే రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే శివసేన విషయంలో ఇది జరగ్గా...ఇప్పుడు అదే సమస్యలో NCPకి ఎదురవుతోంది. చాలా రోజులుగా చర్చించిన తరవాతే ఈ నిర్ణయం తీసుకున్నాని వెల్లడించారు అజిత్ పవార్. ఏం చేసినా అదంతా అభివృద్ధి కోసమే అని తెలిపారు. 


"NCP పార్టీ మొత్తం శిందే ప్రభుత్వంలో చేరినట్టే లెక్క. ఆ పార్టీ పేరు, గుర్తుతోనే ఎన్నికల్లో పోటీ చేస్తాం. మేం మాత్రమే వాటిని వాడుకుంటాం. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరిగినా వాటన్నింటినీ గమనిస్తూ వచ్చాం. అభివృద్ధికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాకే NCP నుంచి బయటకు వచ్చేశాం. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. NCP నుంచి వచ్చేసిన నేతల్లో మరి కొందరికి మంత్రి పదవులు దక్కుతాయి"


- అజిత్ పవార్, మహారాష్ట్ర డిప్యుటీ సీఎం


తప్పేముంది? 


ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ విజనరీని పొగిడారు అజిత్ పవార్. ఆయన నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ప్రశంసించారు. ప్రస్తుతం తాను తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారని, కానీ అవేమీ పట్టించుకోనని తేల్చి చెప్పారు. మహారాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వానికి మద్దతునిస్తున్నట్టు వెల్లడించారు. నాగాలాండ్‌లో 7గురు NCP ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీన్నే ప్రస్తావిస్తూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు అజిత్ పవార్. 


"మూడున్నరేళ్ల క్రితం ఉద్దవ్ థాక్రే నేతృత్వంలో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. శివసేనతో చేతులు కలిపినప్పుడు బీజేపీకి దగ్గరైతే తప్పేముంది..? నాగాలాండ్‌లో అదే జరిగింది కదా? ఇప్పుడిదే నిర్ణయాన్ని మహారాష్ట్రలో తీసుకుంటే అందులో తప్పేముంది..? ఇదంతా మహారాష్ట్ర ప్రజల కోసమే"


- అజిత్ పవార్, మహారాష్ట్ర డిప్యుటీ సీఎం


Also Read: మహారాష్ట్ర పాలిటిక్స్‌పై బీజేపీ మాస్టర్ స్ట్రోక్, రెండేళ్లలో మారిపోయిన సీన్