Maharashtra Political Crisis:
రెండేళ్లలో రెండు దాడులు..
సర్జికల్ స్ట్రైక్ గురించి తెలుసుగా. ఉన్నట్టుండి మెరుపు దాడులు చేయడం. బార్డర్‌లోనే కాదు. రాజకీయాల్లోనూ సర్జికల్ స్ట్రైక్‌లుంటాయి. మహారాష్ట్ర ఇందుకు ఉదాహరణ. రెండేళ్లలో రెండు దాడులను ఎదుర్కొన్నాయి ఇక్కడి పాలిటిక్స్. బీజేపీ మైండ్‌గేమ్‌తో దెబ్బకి సీన్ అంతా మారిపోయింది. మహారాష్ట్ర వికాస అఘాడి (MVA) పేరిట సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాగా...కేవలం రెండేళ్లలో రెండు పెద్ద దెబ్బలు కొట్టింది బీజేపీ. మొదటి దెబ్బకు ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు రెండో దెబ్బకి ప్రతిపక్ష కూటమి పునాది కదిలిపోయింది. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌పై మేనల్లుడు అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. నాయకత్వం విషయంలో చాన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్నారని పైకి చెబుతున్నా...లోపల జరిగింది మాత్రం వేరే. శివసేనలో ఉన్న అసంతృప్తి నేత ఏక్‌నాథ్ శిందేకి గాలం వేసి ఆ పార్టీని చీల్చిన బీజేపీ...ఆ తరవాత NCPని టార్గెట్ చేసింది. ఇలా కూటమిలోని రెండు పార్టీలనూ దెబ్బ కొట్టింది. అజిత్ పవార్ తిరుగుబాటుతో NCPకి గట్టి దెబ్బే తగిలింది. మహారాష్ట్రలో తమకు ప్రతిపక్షం అనేదే లేకుండా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్న బీజేపీ...దాన్ని కరెక్ట్‌గా అమలు చేసింది. అజిత్ పవార్‌తో పాటు 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మేరకు బీజేపీకి గట్టి పట్టు దొరికినట్టే. మెజార్టీ బాగానే పెరుగుతుంది. ఇప్పటికే 125 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీకి కొత్త మంత్రులూ తోడైతే సులువుగా మెజార్టీ సాధించేస్తుంది. ఓవరాల్‌గా రాష్ట్ర రాజకీయాల్ని శాసించే పొజిషన్ వచ్చేస్తుంది.
కూటమికి చీలికలు..
ఈ ఊహించని పరిణామం జరగక ముందే మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని హింట్ ఇచ్చారు. అటు ముఖ్యమంత్రి శిందే కూడా ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపారు. నిజానికి అజిత్ పవార్ గనక తమ వర్గంలోకి ఎంటర్ అవ్వాలని చూస్తే...తాము ఎగ్జిట్ అయిపోతామని శిందే బీజేపీ హైకమాండ్‌తో చెప్పినట్టు సమాచారం. కానీ..ఇప్పుడు ఆయన స్వరం మారిపోయింది. "ఇద్దరు డిప్యుటీ సీఎంలతో మహారాష్ట్రలో ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటైంది" అని కామెంట్స్ చేశారు శిందే. చీలిపోయిన ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు శరద్ పవార్ గట్టిగానే ప్రయత్నించారు. అటు శిందే మాత్రం ఈ కూటమిని చీల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పోటీలో చివరికి శిందే పైచేయి సాధించారు. ప్రస్తుతానికి అజిత్ పవార్‌కి 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకోవాలంటే 36 కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే...అటు NCP మాత్రం అజిత్ పవార్‌పై అనర్హతా వేటు వేసేందుకు న్యాయ పోరాటం చేసే అవకాశాలున్నాయి. మరి ఇంత చేసిన బేజీపీ...ఇది ఊహించకుండా ఉంటుందా..? దానికీ ఏదో మార్గం వెతుక్కునే ఉంటుంది. మొత్తానికి మాస్టర్ స్ట్రోక్‌తో మహారాష్ట్ర రాజకీయాల్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంది బీజేపీ.
Also Read: NCP Ajit Pawar Takes Oath: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని మలుపు, డిప్యుటీ సీఎంగా అజిత్ పవార్