ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పర్యటించనున్నారు. గిరిజన యోధులకు సంబంధించి నిర్వహించనున్న సెలబ్రేషన్స్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ భోపాల్ వెళ్లనున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మోదీ పర్యటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని పర్యటన కోసం భారీగా ఖర్చు చేయనుండటమే అందుకు ముఖ్య కారణంగా తెలుస్తోంది. బీజేపీ మాత్రం తమ ప్లాన్స్ అమలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.
భోపాల్‌లో జరగనున్న కార్యక్రమాల కోసం నాలుగు గంటల పాటు నగరంలో ఉండగా.. వేదికపై 1 గంట 15 నిమిషాల పాటు ప్రధాని మోదీ ఉండనున్నారు. ఇందుకోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం 5 వేదికలను నిర్మిస్తోంది. ఇందుకుగానూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.23 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. ఇందులో 13 కోట్ల రూపాయాలను భోపాల్‌లోని జంబోరీ మైదానంలో నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రజలను తరలించడానికే ఖర్చు చేయనుండటం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై ఒత్తిడి లేదు... గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చు... ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు
మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజన వీరుడు బిర్సా ముండా స్మరణార్థం జన్‌జాతీయ గౌరవ్ దివాస్‌ను నవంబర్ 15న నిర్వహించ తలపెట్టింది. ఈ కార్యక్రమానికి హాజరుకానున్న ప్రధాని మోదీ.. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశంలో నిర్మించిన తొలి రైల్వే స్టేషన్ హబీబ్‌గంజ్ స్టేషన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. జన్‌జాతీయ గౌరవ్ దివాస్‌ను నవంబర్ 15 నుంచి 22 వరకు వారం రోజుల పాటు నిర్వహించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బిర్సా ముండా గౌరవార్థం వారం రోజులపాటు సెలబ్రేషన్స్ చేసేందుకు సన్నాహకాలు మొదలుపెట్టింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది గిరిజనులు జంబోరీ మైదానానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. గిరిజనులకు సంబంధించిన కళాఖండాలతో పాటు గిరిజన వీరులు, నేతల చిత్రాలను ప్రదర్శించేలా జంబోరీ మైదానాన్ని అలంకరించారు. ఇందుకోసం 300 మంది గిరిజనులు వారం రోజులపాటు శ్రమించారు. రూ.12 కోట్లు ట్రాన్స్‌పోర్ట్‌కు, మరో 9 కోట్ల రూపాయలను టెంట్లు, డెకరేషన్, ఐదు సభా వేదికలు, పబ్లిసిటీ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగలకు 47 సీట్లు రిజర్వ్ అయి ఉన్నాయి. ఇందులో 2008లో బీజేపీ 29 సీట్లు నెగ్గగా.. 2013కి ఆ సంఖ్య 31కు పెరిగింది. 2018లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గిన షెడ్యూల్డ్ తెగల సభ్యుల సంఖ్య 16కు పడిపోయింది. గిరిజన ప్రజల్ని తమ వైపునకు తిప్పుకునేందుకు, వారి విశ్వాసం చూరగొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉత్సవాలు జరుపుతున్నట్లు కనిపిస్తోంది.
Also Read: రూ. 25వేల కోట్ల బకాయిలు డిస్కంలకు చెల్లించండి.. ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ లేఖ !
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం మధ్యప్రదేశ్‌లో షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారిపై అత్యధిక సంఖ్యలో 2,401 వేధింపుల కేసుల నమోదయ్యాయి. 2019లో 1,922 కేసులు నమోదు కాగా, 2018లో 1868 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది 28 శాతం కేసులు పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ రిపోర్టులు చెబుతున్నాయి.
పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.450 కోట్ల వ్యయంతో హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. జర్మనీలోని హీడెల్ బర్గ్ రైల్వే స్టేషన్ తరహాలోనే దీన్ని నిర్మించారు. హబీబ్ గంజ్ స్టేషన్ పై 2016 జూన్‌లో నిర్ణయం తీసుకోగా 2017లో పనులు ప్రారంభించి ఇటీవల పూర్తిచేశారు. అత్యంత ఆధునాతన సౌకర్యాలతో ప్రయాణీకులు వచ్చేవారు, వెళ్లేవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉన్నాయి. స్థూపాలు, భోజ్‌పూర్ టెంపుల్, భింబేట్క, తవా డ్యామ్, గిరిజన మ్యూజియం గ్లింప్లెస్ ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్‌లో ఫుడ్ జోన్, కిడ్స్, ఎంటర్‌టైన్మెంట్ జోన్, రీటైల్ జోన్ ఏర్పాటు చేశారు.
Also Read: మావోయిస్టు ఆర్కే జీవిత విషయాలు ప్రింటింగ్... నవ్య ప్రింటింగ్ ప్రెస్ లో పోలీసులు సోదాలు