వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం తీరం దాటినప్పటికీ మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడిస్తుంది. వర్షాల ప్రభావంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి చాలా ప్రాంతాలు నీటమునిగాయి. పంటలు దెబ్బతిన్నాయి. వరద పరిస్థితులపై సమీక్షించిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలకు.. హెక్టారుకు రూ.20,000 పరిహారాన్ని ప్రకటించారు. అలాగే దెబ్బతిన్న ఇళ్లకు రూ.25 వేలు సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకారులు, భవన నిర్మాణ కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 5000 తక్షణ సాయం ప్రకటించారు. దీంతో 48 వేల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు, 44 వేల మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
Also read: ఏడ్చే మగాడిని నమ్మాల్సిందే... మగాళ్లూ హ్యాపీగా ఏడవండి, మానసిక ప్రశాంతత పొందండి
పుదుచ్చేరిలో గత మూడు రోజులుగా 15 సెం.మీ కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా కరైకాల్‌లో దాదాపు 5 వేల హెక్టార్లలో వరి పంట నష్టపోగా, పుదుచ్చేరిలో 25 ఇళ్లు దెబ్బతిన్నాయి. వర్షాల నష్టాన్ని అంచనా వేసి ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ ఉపశమనం కల్పించేందుకు పరిహారం అందిస్తామని సీఎం రంగసామి తెలిపారు. ఉద్యాన, ఇతర పంటలకు జరిగిన నష్టానికి పరిహారం కూడా అందజేస్తామన్నారు.
Also Read: కంగనాకు బాగా తలకెక్కింది.. పద్మశ్రీ లాగేసుకొని.. జైల్లోకి తోసేయండి'
పశువుల నష్టానికి గాను ఆవు చనిపోతే రూ. 10,000, మేకకు రూ. 5,000 పరిహారం అందజేయనున్నారు. పుదుచ్చేరి ప్రభుత్వం నష్టాలను అంచనా వేసిన తర్వాత కేంద్రం సాయం కోరనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నష్టంపై పూర్తి నివేదికను సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రంగసామి సూచించారు. సెల్లిపేట బెడ్ డ్యామ్ మరమ్మతులకు చర్యలు తీసుకున్నామని, శంకరాభరణి నదిపై రూ.16 కోట్లతో మరో బెడ్ డ్యాం నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించామని రంగస్వామి తెలిపారు.
Also Read: కేరళలో కొత్త వైరస్.. దండయాత్ర.. ఇది మనుషులపై మహమ్మారుల దండయాత్ర!
వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు కేటాయించామని సీఎం రంగసామి తెలిపారు. ఇందులో గ్రామీణ రహదారులకు రూ.50 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేల స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల కింద రూ.36 కోట్లు కేటాయించామన్నారు. ఈ పనుల నిర్వహణకు రూ.100 కోట్ల టెండర్లు ఆహ్వానించినట్లు తెలిపారు. కాల్వల నిర్మాణంతో పాటు వర్షపు నీటి పారుదల సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు వచ్చే ఏడాది వరదలు లేదా నీరు నిలిచిపోకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: వర్షాల కారణంగా 12 మంది మృతి.. సహాయక శిబిరానికి 1700 మంది తరలింపు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి