తమిళనాడులో వర్షాల కారణంగా ఇప్పటి వరకు 12 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర రెవెన్యూ ,డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి రామచంద్రన్ వెల్లడించారు. 11 ఎన్డీఆర్ఎఫ్, 07 ఎస్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తమిళనాడు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. చెన్నై నగరం నీటమునిగింది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందమయ్యాయి.  


కుంభకోణంలో  కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోడ కూలిపోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలిక మృతి చెందింది. ఆమె తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఘటనలో పైకప్పు కూలడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. బుధవారం కుంభకోణంలో కురిసిన భారీ వర్షానికి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి.


రానున్న 24 గంటల్లో చెన్నైలో మరింత వర్షం కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ఉత్తర తమిళనాడు వైపు కదులుతున్నందున, రాజధాని నగరంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. చెన్నై సహా 20 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే రాష్ట్రంలో సగటు కంటే 42% వర్షపాతం నమోదైంది. బుధ, గురువారాల్లో నగరంలో 150 నుంచి 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 


వర్షాలు కురుస్తున్నందున.. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలి. తగినన్ని ఆహారం మరియు నీటిని సిద్ధంగా ఉంచుకోండి. కమ్యూనికేషన్ కోసం అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయండి. ఆహారం మరియు జనరేటర్ సెట్లను (విద్యుత్ సరఫరా కోసం) పంపిణీ చేసేందుకు, మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడానికి సిద్దంగా ఉన్నాం.
                                                                                               - గ్రేటర్ చెన్నై కమిషనర్, గగన్‌దీప్ సింగ్


ప్రస్తుతం 53 బోట్లను సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 600 మోటారు పంపులను నీటని తోడేందుకు ఉపయోగిస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తాయని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 450 సైరన్ టవర్లను ఏర్పాటు చేసింది. భారీ వర్షం కారణంగా ఇళ్లు మరియు వీధులు జలమయం అయితే అత్యవసర పరిస్థితుల్లో నగరవాసులు ఉపయోగించుకోవచ్చు. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 1,700 మందిని సహాయక శిబిరాలకు తరలించారు.


Also Read: Rape Threats Arrest : క్రికెటర్ కుమార్తెకు అత్యాచార బెదిరింపుల కేసులో హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్ !