ABP  WhatsApp

Mamata Banerjee: మోదీ సర్కార్‌పై దీదీ సమర శంఖారావం- భాజపాయేతర పార్టీలు, సీఎంలకు లేఖలు

ABP Desam Updated at: 01 Apr 2022 10:15 PM (IST)
Edited By: Murali Krishna

భాజపాయేతర పార్టీలు, ముఖ్యమంత్రులకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లేఖలు రాశారు.

didi

NEXT PREV

2024 పార్లమెంటు ఎన్నికల కోసం బంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యూహాలు రచిస్తున్నారు. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏకమవ్వాలని భాజాపాయేతర పార్టీలు, ముఖ్యమంత్రులకు బంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు.






ఈ మేరకు వ్యూహాలపై చర్చించే సమావేశం కోసం పిలుపునిచ్చారు. భాజపాయేతర పార్టీలన్నీ ఐక్యత సాధించి దేశం కోరుకునే ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేసే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించాలని లేఖలో మమత పేర్కొన్నారు.



భారతీయ జనతా పార్టీ అణచివేత పాలనపై ప్రగతిశీల శక్తులన్నీ ఐక్యతగా పోరాడాలి. దేశ సంస్థాగత ప్రజాస్వామ్య విలువలపై భాజపా ప్రత్యక్ష దాడులు చేస్తోంది. ఈ దాడులను ఐక్యతగా ఎదుర్కోవాలని కోరేందుకే లేఖ రాస్తున్నాను. ఈ అంశంపై ముందుకు సాగేందుకు ఒక వేదికగా ప్రతిపక్ష పార్టీల నేతలందరం సమావేశం కావాలి. మన దేశానికి అవసరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఐక్యంగా, విలువలతో కూడిన ప్రతిపక్షం కోసం మనం కట్టుబడి ఉండాలి.                           -   మమతా బెనర్జీ, టీఎంసీ అధినేత్రి


దీదీ ప్లాన్..


బంగాల్‌లో హ్యాట్రిక్ విజ‌యం సాధించిన తర్వాత మ‌మ‌తా బెన‌ర్జీ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈసారి టార్గెట్ 2024 అంటూ సంకేతాలు ఇస్తున్నారు. బంగాల్‌లో ఓటర్లు ఇచ్చిన జోష్‌తో దిల్లీ కోటలను బద్దలు కొట్టేందుకు పావులు కదుపుతున్నారు. మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.


ప్రస్తుతం దేశంలో భాజపాను ఎదుర్కొని ముఖ్యంగా మోదీ-షా ద్వయాన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి ఏ పార్టీకి లేదన్నది విశ్లేషకుల మాట. అయితే కాంగ్రెస్‌కు ఆ శక్తి ఉన్నా ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే సమయంలో దీదీపై దేశవ్యాప్త ప్రజాదరణ ఉందని, మోదీని ఎదుర్కొనే సత్తా ఆమెకే ఉందని దాదాపు అన్ని విపక్ష పార్టీలు అంగీకరిస్తున్నాయి. ఇటీవల జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చూపిన తెగువే ఇందుకు సాక్ష్యం. మరి దీదీ పిలుపునకు విపక్ష పార్టీలు కలిసి వస్తాయో లేదో చూడాలి.


Also Read: Rajya Sabha Elections 2022: 6 రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు ఒకే రోజు పోలింగ్







Also Read: Tamil Nadu News : రూపాయి నాణేలతో బైక్ కొన్న యువకుడు, లెక్కపెట్టడానికే 10 గంటలు పట్టింది!

Published at: 29 Mar 2022 01:26 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.