ఓసారి తలెత్తి సూర్యుడిని చూడండి. కష్టంగా ఉంది కదా... కానీ ఓ వ్యక్తి సూర్యుడిని నేరుగా చూస్తూ రికార్డు స్థాపించాడు.అది కూడా ఒక్కసారి కూడా కన్నార్పలేదు. అలా ఎంతసేపు చూశాడో తెలుసా ఒక గంటా 26 నిమిషాల పాటూ. అతను సూర్యుడిని చూస్తున్నప్పుడు ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఆ వ్యక్తి పేరు మహేంద్ర సింగ్ వర్మ, మధురలో నివసిస్తున్నారు. వయసు 70 ఏళ్లు. ఆ రికార్డు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కలన్నది మహేంద్రసింగ్ కోరిక. 


ఎలా సాధ్యం?
మనం సూర్యుడిని కొన్ని సెకన్లే చూడలేకపోతున్నాం? మరి మహేంద్ర సింగ్ కు ఎలా సాధ్యమైంది? ఇదే విషయాన్ని ఆయన్ను అడిగితే ‘నాకు త్రాటకం విద్య తెలుసు. త్రాటకం అంటే నల్ల బిందువును చూస్తూ చేసే ఒకరకమైన ధ్యానం. దాని వల్లే సూర్యుడిని కన్నార్పకుండా తదేకంగా చూడగలిగాను.త్రాటకం నేను రోజూ ఆచరించే ధ్యానం’ అని చెప్పుకొచ్చారు. గతేడాది కేవలం గంట పాటూ చూసి రికార్డు నెలకొల్పాడు. తాజాగా తన రికార్డును తానే తిరగరాశాడు. సూర్యుడిని నేరుగా కళ్లతో చూడడాన్ని ఆయన గత పాతికేళ్లుగా ప్రాక్టీసు చేస్తున్నారు.


మరొక వ్యక్తి కూడా..
2018లో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన చలగల కిశోర్ కుమార్ అనే వ్యక్తి కూడా సూర్యుడిని కళ్లతో నేరుగా 20 నిమిషాల పాటూ చూసి రికార్డు నెలకొల్పారు. ఆ సమయంలో వాతావరణ ఉష్ణోగ్రత 41 డిగ్రీలు ఉంది. ఇప్పుడు ఆ రికార్డును మహేంద్ర తుడిచేశారు. 


ఈ సాహసం చేయద్దు...
ఇలాంటి సాహసాలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు కంటి వైద్యులు. సూర్యుడిని నేరుగా కంటితో చూడడం మంచిది కాదని, అందులోనూ కన్నార్పకపోవడం వల్ల మరిన్న సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కొందరికి కంటి చూపు పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కనురెప్ప వేయనప్పుడు కళ్లు పొడిగా మారిపోతాయి. దీంతో మంట, నీళ్లు కారడం వంటివి సంభవిస్తాయి. కొన్నాళ్లకు అస్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. కళ్లలో తేమ లేకపోతే అంటువ్యాధులు త్వరగా వచ్చేస్తాయి. అలాగే వాతావరణంలోని ధూళి కణాలు కూడా కళ్లలో చేరుతాయి. అందుకే మనిషికి శ్వాసలాగే, కళ్లు శ్వాస తీసుకునేది కనురెప్పలు ఆర్పడం ద్వారానే అని వివరిస్తున్నారు వైద్యులు. 


Also read: ఇలా రాగిదోశ చేస్తే వదిలిపెట్టకుండా తినేస్తారు, అధిక బరువు నుంచి మధుమేహం వరకు ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు


Also read: లైంగిక అంటువ్యాధులు ఎన్నో, ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు