లైంగిక వ్యాధులు గురించి మాట్లాడుకోవడానికే చాలా మంది ఇష్టపడరు. లైంగికంగా ఒకరి నుంచి ఒకరికి సోకే వ్యాధులు ఇవి.  అవి కూడా శరీరాన్ని కుంగదీసి, రకరకాల జబ్బుల బారిన పడేలా చేస్తాయి. లైంగిక వ్యాధుల లక్షణాలు అనగానే అందరూ జననేంద్రియాల వద్ద పుండ్లు, దురద, పొక్కులు వంటివే అనుకుంటారు. కానీ ఈ ఇన్ఫెక్షన్లు కొన్ని సాధారణ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. 


కొన్ని లైంగిక అంటువ్యాధుల జాబితా ఇదిగో
1. సిఫిలిస్
2. గొనేరియా
3. క్లామిడియా
4.హెచ్ఐవీ,ఎయిడ్స్
5. ప్యూబిక్ లైస్
6. ట్రైకోమోనియాసిస్


ఈ ఇన్ఫెక్షన్లు చూపించే కొన్ని సాధారణ లక్షణాలు, లైంగిక వ్యాధులను గుర్తుకు తేవు.మరేదైనా సమస్య వల్ల ఇలా అవుతుందేమో అనుకుంటారు. కానీ ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు లైంగిక వ్యాధులు కూడా ఉన్నాయేమో చెక్ చేయించుకోవాలి. 


1. ఎర్రగా మారిన కళ్లు
కళ్లు చాలా సార్లు ఎర్రగా మారుతాయి. నిద్ర సరిపోనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, కండ్ల కలక వచ్చినప్పుడు. అందుకే ఈ లక్షణాన్ని చాలా మంది పట్టించుకోరు. కానీ కళ్లు ఎర్రగా మారి, కనురెప్పలు అతుక్కుంటుంటే మాత్రం అది గొనేరియా లేదా క్లామిడియా వంటి లైంగిక వ్యాధి లక్షణంన కూడా కావచ్చు. సిఫిలిస్ ఇన్ఫెక్షన్ కూడా కళ్లపై దాడి చేస్తుంది. అలసట, జ్వరం, చర్మంపై దద్దుర్లుతో కూడి ఉంటుంది.


2. జుట్టు రాలడం
సిఫిలిస్ ఇన్ఫెక్షన్ కాస్త ముదిరినప్పుడు అంటే రెండో దశలో జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. ఇన్ఫెక్షన్ సోకాక కొన్ని నెలల తరువాత ఈ లక్షణం బయటపడుతుంది. జుట్టు రాలడమంటే కేవలం తల మీదే జుట్టే కాదు, కనుబొమ్మలు, చేతులు, కాళ్లపై ఉన్న వెంట్రుకలు కూడా రాలిపోతాయి. 


3. కీళ్ల నొప్పులు
క్లామిడియా ఇన్ఫెక్షన్ వల్ల కలిగే లక్షణం ఇది. మణికట్టు, మోకాలు, మోచేతులు, చీలమండలు వంటి కీళ్లపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి కీళ్లలో సెప్టిక్ ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది. కీళ్లవాపులు వచ్చి ఒకోసారి వెంటనే చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది గొనేరియా ఇన్ఫెక్షన్ వల్ల కలుగుతుంది. 


4. పిరుదులపై గడ్డలు
చాలా మంది పిరుదుల ప్రాంతంలో నొప్పి,మంట వస్తే పైల్స్ వల్ల అనుకుంటారు. కానీ ఇతర సమస్యల వల్ల కూడా కావచ్చు. పిరుదులపై గడ్డలు రావడం లైంగిక ఇన్ఫెక్షన్ వల్ల కూడా అయ్యే అవకాశం ఉంది. వీటికి కూడా చికిత్స వెంటనే అందించాలి. లేకుంటే చాలా నొప్పి, బాధను అనుభవించాల్సి వస్తుంది. 


Also read: SuperFoods: వీటిని పరగడుపునే ఖాళీ పొట్టతో తింటే ఎంతో ఆరోగ్యం



Also read: విల్‌స్మిత్ భార్యది గుండు కాదు, అది అలోపేషియా సమస్య, ఎందుకొస్తుందంటే