కొత్త జట్ల మధ్య జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్‌ను విజయం వరించింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మూడు వికెట్లు తీసిన పంజాబ్ బౌలర్ మహ్మద్ షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.


ఆ ఇద్దరి వల్లే ఆ మాత్రమైనా...
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో టాప్ ఆర్డర్‌ను షమీ పూర్తిగా కుప్పకూల్చాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఫాంలో ఉన్న కేఎల్ రాహుల్‌ను (0: 1 బంతి) అవుట్ చేసి షమి లక్నోకు తేరుకోలేని షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత క్వింటన్ డికాక్ (7: 9 బంతుల్లో, ఒక ఫోర్), మనీష్ పాండేలను (6: 5 బంతుల్లో, ఒక ఫోర్) కూడా వెంట వెంటనే అవుట్ చేశాడు. ఎవిన్ లెవిస్‌ను (10: 9 బంతుల్లో, రెండు ఫోర్లు) వరుణ్ ఆరోన్ అవుట్ చేయడంతో లక్నో 4.3 ఓవర్లలో 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.


అయితే ఆ తర్వాత దీపక్ హుడా (55: 41 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు), అండర్-19 ఆటగాడు ఆయుష్ బదోని (54: 41 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) లక్నోను ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 87 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాక కాసేపటికే దీపక్ హుడా అవుటయ్యాడు. ఆ తర్వాత ఆయుష్ బదోని కూడా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో బదోని అవుటయ్యాడు. కృనాల్ పాండ్యా (21 నాటౌట్: 13 బంతుల్లో, మూడు ఫోర్లు) కూడా వేగంగా ఆడాడు. దీంతో లక్నో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీయగా... వరుణ్ ఆరోన్ రెండు వికెట్లు, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు.


టెవాటియా మ్యాజిక్
159 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు కూడా ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. శుభ్‌మన్ గిల్ (0: 3 బంతుల్లో), విజయ్ శంకర్‌లను (4: 6 బంతుల్లో) శ్రీలంక బౌలర్ దుష్మంత చమీర వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. దీంతో గుజరాత్ 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.


ఈ దశలో మాథ్యూ వేడ్ (30: 29 బంతుల్లో, నాలుగు ఫోర్లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (33: 28 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) గుజరాత్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. హార్దిక్ పాండ్యాను కృనాల్ పాండ్యా, మాథ్యూ వేడ్‌ను దీపక్ హుడా వరుస ఓవర్లలో అవుట్ చేశారు. అప్పటికి గుజరాత్ స్కోరు 78 పరుగులే.


ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ (30: 21 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు), రాహుల్ టెవాటియా (40 నాటౌట్: 24 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) గుజరాత్‌ వేగంగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. అయితే లక్ష్యానికి దగ్గరగా వచ్చాక మిల్లర్ అవుటయినా అభినవ్ మనోహర్‌తో (15 నాటౌట్: 7 బంతుల్లో, మూడు ఫోర్లు) కలిసి టెవాటియా మ్యాచ్‌ను ముగించాడు. లక్నో బౌలర్లలో చమీర రెండు వికెట్లు తీయగా... అవేష్ ఖాన్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడాలకు తలో వికెట్ దక్కింది.


Also Read: PBKS Vs RCB: కెప్టెన్ మారినా కలిసిరాలేదు - పంజాబ్‌పై ఆరు వికెట్లతో బెంగళూరు ఓటమి!


Also Read: Tilak Varma in IPL: అసలెవరీ తిలక్ వర్మ - ముంబై తరఫున అరంగేట్రం - మొదటి మ్యాచ్‌లోనే మెరుపులు!