Tamil Nadu News : నచ్చిన బైక్ కొనుక్కుని చక్కర్లు కొడితే ఆ మాజానే వేరు. యువకుల్లో చాలా మంది లవర్ కన్నా బైక్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనడంలో అతిశయోక్తి లేదు. తమిళనాడులో ఓ యువకుడు తన డ్రీమ్ బైక్ కొనుక్కోవడానికి మూడేళ్లు కష్టపడ్డాడు. తన డ్రీమ్ బైక్ కోసం మూడేళ్ల పాటు రూపాయి కాయిన్స్ పొదుపు చేశాడు. సేలం జిల్లాకు చెందిన భూపతి అనే యువకుడు శనివారం రూ.2.6 లక్షల రూపాయి నాణేలు చెల్లించి బజాజ్ డోమినర్ బైక్ ను కొనుగోలు చేశాడు. భూపతి మూడేళ్ల పాటు పొదుపు చేసిన రూపాయి కాయిన్స్ ను బైక్ షోరూమ్ కు తీసుకురాగానే అక్కడి సిబ్బంది షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత తెరుకుని వాటిని కౌంట్ చేయడం మొదలు పెట్టారు. పది గంటల పాటు లెక్కపెడితే గానీ మొత్తం నగదు ఎంతో తెలియలేదు. తమ సిబ్బంది పది గంటల పాటు శ్రమించి ఆ నాణేలు లెక్కించినట్లు బైక్ షోరూమ్ మేనేజర్ మహవి క్రాంత్ తెలిపారు.  



రూపాయి నాణేలతో బైక్ కొనుగోలు 


బీసీఏ గ్రాడ్యుయేట్ అయిన భూపతి గతంలో ఓ ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేశాడు. నాలుగేళ్ల క్రితం ఆ ఉద్యోగానికి గుడ్ బాయ్ చెప్పిన భూపతి ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. తన డ్రీమ్ బైక్ బజాజ్ డోమినర్ కొనుక్కోవాలని మూడేళ్ల క్రితం ఆశపడ్డాడు. కానీ అప్పటికి తన దగ్గర అంత డబ్బు లేదు. అప్పట్లో ఆ బైక్ కాస్ట్ రూ. 2 లక్షలు ఉండేది. అప్పటి నుంచి రోజు కొంత నగదును పొదుపు చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు తనకు నచ్చిన బైక్ ఇన్నాళ్లు పొదుపు చేసిన రూపాయి నాణేలతో కొనుక్కున్నాడు. తన కలల బైక్ సొంతం కావడంతో అతడి ఆనందానికి అవధుల్లేవ్. ఇన్నాళ్లు  ఆ బైక్ కోసం రోజుకు కొంత నగదు పిగ్గీ బ్యాంక్ లో దాచుకున్నానని తెలిపాడు. ఇన్నాళ్టికి తన కల నెరవేరిందన్నాడు. 


ఓ యూట్యూబ్ ఛానల్ 


సేలం జిల్లాలోని అమ్మాపేట్టై ప్రాంతంలోని గాంధీ మైదాన్‌కు చెందిన వివేకానందన్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. అతని కుమారుడు భూపతి చదువు ముగిసిన తర్వాత ఓ ఉద్యోగం చేశాడు. ఇటీవలే బూ టెక్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నాడు. గత నాలుగేళ్లలో 5 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకున్న ఆ యువకుడు తనకు నచ్చిన ద్విచక్ర వాహనాన్ని రూపాయి నాణేలు దాచుకున్నాడు. గత రెండు నెలలుగా పళని, మదురై, దిండిగల్ జిల్లాల్లోని వివిధ బ్యాంకులు రూపాయి నాణేలను స్వీకరిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో యువకుడు బైక్ కొనుక్కోడానికి సిద్ధమయ్యాడు. 



పొదుపు ఆవశ్యకత 


దీనిపై భూపతి మాట్లాడుతూ.. ‘‘బైక్ కొనడం చాలా కాలంగా నా కల. కానీ నాలాంటి మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వారికి వాహనం కొనడం పెద్ద సాహసమే. నా యూట్యూబ్‌ ఛానల్ లో చాలా వీడియోలు పోస్టు చేశాను. ఆ వీడియోలు ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్నేహితులతో పంచుకుంటాను. ఈ సమయంలో నేను ఎంతో ఆశపడిన ద్విచక్ర వాహనం కొనడానికి కొంత డబ్బు ఆదా చేసుకున్నాను. నా బైక్ చాలా తక్కువ మైలేజీని ఇస్తుందని స్టోర్ మేనేజర్ చెప్పాడు. ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని తెలిసింది. ఈ రెండు నన్ను కలిచివేశాయి. కానీ పొదుపు ఆవశ్యకతను తెలియజేయాలని రూపాయి నాణేలతో బైక్ కొనుగోలు చేయడానికి ప్లాన్ చేశాను." అని అన్నాడు.