ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఛలోక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీరియస్‌గా సాగే చర్చలో కూడా తనదైన ఛలోక్తులతో నవ్వుల పువ్వులు పూయింస్తుంటారు వెంకయ్య. ఆయన ప్రసంగాలకు అందుకే అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు భాషపై పట్టు ఉన్న అతి కొద్ది మంది నేతల్లో ఆయన అగ్రస్థానంలో ఉంటారు.
అయితే ఉపరాష్ట్రపతి అయిన తర్వాత పార్లమెంటులో మాట్లాడే అవకాశం ఆయన మిస్ అయ్యారు. కానీ రాజ్యసభ ఛైర్మన్ హోదాలో ఉన్నప్పటికీ అప్పడప్పడు ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటారు. తాజాగా రాజ్యసభలో ఆయన వేసి ఛలోక్తికి సభ్యులు పడిపడి నవ్వారు.
రాజ్యసభలో జరుగుతోన్న సమావేశంలో భాజపా ఎంపీ, మలయాళ నటుడు సురేష్ గోపీ వంతు రాగానే ఆయన లేచి నిలబడి మాట్లాడుతున్నారు. అయితే ఆయన సమావేశంలో లేచి నిలబడి తన గురించి చెబుతుండగా ఛైర్మన్ వెంకయ్య నాయుడు ఆయన ప్రసంగంలో జోక్యం చేసుకున్నారు. "సార్ ఏంటిది? గడ్డమా? లేక మాస్క్? నాకు అర్థకావడం లేదు" అంటూ వెంకయ్య నాయుడు అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగి నవ్వులు విరిశాయి.
అయితే ఎంపీ సురేష్ గోపి నవ్వుతూ ఇది గడ్డమే తన తదుపరి సినిమా కోసం ఇలా పెంచానని వివరణ ఇచ్చారు. తర్వాత ఆయన ప్రసంగం కొనసాగించమని వెంకయ్యనాయుడు అన్నారు.
సురేశ్ గోపి
సురేశ్ గోపి.. మలయాళ నటుడు. సినిమాల్లోనే కాకుండా టీవీ వ్యాఖ్యాతగా కూడా ఆయన చేశారు. మలయాళంలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి ఆయనే వ్యాఖ్యాత. మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆయన నటించారు. 2017 నుంచి ఆయన భాజపా తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిసూర్ స్థానం నుంచి భాజపా తరఫున పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు.
శంకర్ తెరకెక్కించిన 'ఐ' చిత్రంలో సురేశ్ గోపీ విలన్‌గా నటించారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.