బంగాల్ అసెంబ్లీలో ఘర్షణ చెలరేగింది. బీర్భూమ్ హింసాకాండపై చర్చ చేపట్టాలని భాజపా ఎమ్మెల్యేలు పట్టు పట్టారు. ఇందుకు స్పీకర్ అంగీకరించలేదు. దీంతో భాజపా శాసనసభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత టీఎంసీ, భాజపా ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తోపులాటలో కొంతమంది ఎమ్మెల్యేలు చొక్కాలు కూడా చిరిగిపోయాయి. ఈ ఘర్షణలో భాజపా ఎమ్మెల్యే మనోజ్ టిగ్గా గాయపడ్డారు.






భాజపా వాకౌట్


ఘర్షణ తర్వాత భాజపా ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మజూందార్‌కి కూడా తోపులాటలో గాయాలయ్యాయని పార్టీ పేర్కొంది. ఆయన ముక్కుకి గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సీరియస్ అయిన స్పీకర్ ఐదుగురు భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. 


ఆ తర్వాత అసెంబ్లీ బయట భాజపా ఎమ్మెల్యేలు నిరసన చేశారు. బీర్భూమ్ హింసపై చర్చ చేపట్టమన్నందుకే తమపై టీఎంసీ ఎమ్మెల్యేలు దాడి చేశారని భాజపా ఆరోపించింది. తమ ఎమ్మెల్యేలపై దాడి చేసి చొక్కాలు చింపేసారని భాజపా నేత సువేందు అధికారి ఆరోపించారు.


ఇందుకు సంబంధించిన వీడియోను భాజపా ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. బంగాల్ గవర్నర్‌పై దాడి తర్వాత ఇప్పుడు భాజపా ఎమ్మెల్యేలపై టీఎంసీ శాసనసభ్యులు దాడి చేశారని ఆయన ఆరోపించారు.


దారుణం


రాంపుర్ హట్ పట్టణానికి సమీపంలో ఉన్న బగ్టుయి గ్రామంలో దుండగులు మంగళవారం హింసాకాండకు పాల్పడ్డారు. ఓ ఇంటిలో ఉన్న ఎనిమిది మందిని సజీవ దహనం చేశారు. అంతకుముందు వీరిని తీవ్రంగా కొట్టినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ఈ హింసాకాండలో దాదాపు 12 ఇళ్ళను తగులబెట్టారు. టీఎంసీ నేత భడు షేక్ హత్యానంతరం ఈ హింసాకాండ జరిగింది.


ఈ కేసులకు సంబంధించి పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు. షేక్‌ను హత్య చేయడానికి బాంబు దాడి చేసిన వ్యక్తి కూడా అరెస్టయినవారిలో ఉన్నాడు. ఈ హింసాకాండలో మరణించినవారి మృతదేహాలకు నిర్వహించిన పోస్ట్‌మార్టమ్ నివేదిక ప్రకారం, మొదట వీరిని తీవ్రంగా కొట్టి, హింసించి, ఆ తర్వాత సజీవ దహనం చేసినట్లు  తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలలు ఉన్నారు. 



Also Read: WATCH: యూపీ అసెంబ్లీలో ఆసక్తికర ఘటన- యోగి, అఖిలేశ్ 'ఫేస్ టూ ఫేస్'