Lok Sabha Election 2024: 


 

కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు..

 

లోక్‌సభ ఎన్నికలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే నిజమైన దేశభక్తికి నిదర్శనం అని అన్నారు. బీజేపీని ఓడించి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రెండు సార్లు అధికారంలోకి వచ్చినా చేసిందేమీ లేదని మండి పడ్డారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మిగతా పార్టీ కార్యకర్తలతో పోల్చితే..ఆప్ కార్యకర్తలు చాలా గౌరవంగా బతుకుతున్నారని, గుండాయిజం చేయడం లేదని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలోని ప్రజలు ఆప్‌ కార్యకర్తల్ని ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటారని గుర్తు చేశారు. ఆప్‌లోని వాలంటీర్లకు పొలిటికల్ బ్యాగ్రౌండ్‌ లేదని, అందుకే వాళ్లు మెరుగ్గా పని చేయగలుగుతున్నారని ప్రశంసించారు. 

 

"వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి మన దేశభక్తిని చాటుకోవాలి. రెండు సార్లు అధికారం కట్టబెట్టినా ఆ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు. ఆప్‌కి కార్యకర్తలే బలం. వాలంటీర్లకు మంచి పేరుంది. వాళ్లెవరికీ పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేదు. అసలు మా పార్టీకే రాజకీయ నేపథ్యం లేదు. మా పార్టీలో నాతో సహా సీనియర్ నేతలంతా రాజకీయాలు చేసే వాళ్లు కాదు. మేమంతా సామాన్య పౌరులమే. ఇదే ఆప్‌ ట్రేడ్‌మార్క్. రెండోసారి అధికారంలోకి వచ్చాక అయినా బీజేపీ దేశాన్ని బాగు చేస్తుందనుకున్నాను. కానీ అది వాళ్ల వల్ల కాలేదు. ఇవాళ దేశంలో అన్ని వర్గాలూ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఎక్కడ చూసినా హింసాత్మక వాతావరణమే కనిపిస్తోంది. మునుపెన్నడూ చూడనంతగాఅవినీతి పెరిగిపోయింది"

 

- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 

 

ఈడీ దాడులపైనా ఫైర్..

 

బీజేపీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రజలకు అర్థం కాలేదని, పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పదేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో దర్యాప్తు సంస్థల దాడులపైనా విమర్శలు చేశారు. రాజకీయ కక్షతో దాడులు చేయిస్తోందని, ఆ పార్టీలో చేరిన వెంటనే ఆ దాడులు ఆపేస్తోందని మండి పడ్డారు. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని చెప్పారు. ఇప్పటి వరకూ బీజేపీకి ప్రత్యామ్నాయమే లేదని అనుకున్నారని, కానీ I.N.D.I.A కూటమి అందుకు సమాధానంగా దొరికిందని అన్నారు. 

 

"ఇప్పటి వరకూ కేంద్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయమే లేదని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు అందరూ I.N.D.I.A కూటమి వైపే చూస్తున్నారు. ఈ విపక్ష కూటమి ఏర్పాటైనప్పటి నుంచి నాకు చాలా మంది మెసేజ్‌లు పంపారు. 2024లో బీజేపీ ప్రభుత్వం రాదని చెప్పారు. ఆ పార్టీలో ఉన్న వాళ్లంతా గూండాలు, దొంగలే. ఆ పార్టీలో చేరగానే వాళ్లపై కేసులు మాఫీ అవుతాయి. దాడులు ఆగిపోతాయి. ఆ పార్టీని గుడ్డిగా నమ్మే వాళ్లను కాకుండా నిజమైన దేశభక్తులతో మాట్లాడాలి. వాళ్ల అభిప్రాయాలు తెలుసుకోవాలి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశాన్ని నాశనం చేస్తారు"

 

- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి