Actress Gautami Tadimalla Quits BJP: 



బీజేపీని వీడిన గౌతమి..


సీనియర్ నటి గౌతమి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు పాతికేళ్లుగా బీజేపీలోనే ఉన్న ఆమె ఉన్నట్టుండి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తనకు నమ్మకం ద్రోహం చేసిన వ్యక్తి కొందరు బీజేపీ నేతలు అండగా ఉన్నారని ఆరోపించారు. జీవితంలో ఎప్పుడూ లేనంతగా సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని, అలాంటి సమయంలోనూ పార్టీ నుంచి తనకు ఎలాంటి సహకారం అందలేదని అసహనం వ్యక్తం చేశారు. తనను మోసం చేయాలని చూసిన వ్యక్తులకు సొంత పార్టీ నేతలే సహకరిస్తున్నారన్న విషయం తెలిసి తట్టుకోలేకపోయానని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఓ నోట్ విడుదల చేశారు. 


"ప్రస్తుతం నా జీవితంలోనే ఎప్పుడూ ఊహించని సంక్షోభ స్థితిలోకి దిగిపోయాను. ఇలాంటి సమయంలోనూ పార్టీ నుంచి నాకు ఎలాంటి మద్దతు లభించలేదు. ఇంత కన్నా బాధాకరమైన విషయం ఏంటంటే నాకు నమ్మకద్రోహం చేయాలని చూస్తున్న వాళ్లకి సొంత పార్టీ నేతలే సహకరిస్తున్నారని తెలిసింది. నా జీవితాన్నే ప్రమాదంలోకి నెట్టేశారు. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది"


- గౌతమి, సినీ నటి, బీజేపీ మాజీ నేత




ఇదీ జరిగింది..


ఓ వ్యక్తి గౌతమికి చెందిన ఆస్తుల డాక్యుమెంట్స్‌ని డూప్లికేట్ చేశాడు. ఆ వ్యక్తికే బీజేపీ నేతలు సహకరించారన్నది ఆమె ఆరోపణ. ట్విటర్‌లో పోస్ట్‌ పెట్టిన గౌతమి...ట్వీట్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై, బీజేపీ తమిళనాడు అకౌంట్స్‌నీ ట్యాగ్ చేశారు. ఎంతో ఆవేదనతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని లేఖ రాశారు. 


"అలగప్పన్ అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం నా పరిస్థితి చూసి నా దగ్గరికి వచ్చాడు. అప్పటికి నా తల్లిదండ్రులు చనిపోయారు. సింగిల్ పేరెంట్‌గా ఎన్నో కష్టాలు పడుతున్నాను. నాకో పెద్ద దిక్కుగా ఉంటానని చెప్పి అలగప్పన్ తన కుటుంబానికి పరిచయం చేశాడు. ఆయనపై నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది. ఆ తరవాత నా ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయనే చూస్తూ వచ్చారు. నా ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ కూడా ఆయన చేతుల్లోనే పెట్టాను. కానీ ఈ విషయంలో నన్ను దారుణంగా మోసం చేశారని ఈ మధ్యే అర్థమైంది. ఇప్పటికీ నన్ను, నా కూతుర్ని వాళ్ల కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్టుగా నాటకాలు ఆడుతున్నారు. ఒంటరి మహిళనే అయినా చాలా పోరాడాను. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేయడమే సరైన నిర్ణయం అనిపిస్తోంది. 25 ఏళ్ల నా ప్రయాణం ఇవాళ్టితో ముగిసిపోయింది"


- గౌతమి, బీజేపీ మాజీ నేత