Kerala Rename: 


కేరళంగా మార్చాలంటూ ప్రతిపాదనలు..


కేరళ పేరుని "కేరళం"గా మార్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ప్రవేశ పెట్టింది. నిర్ణయించుకుంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కేరళ పేరుని కేరళంగా మార్చాలని కోరింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బిల్‌ని ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా రాజకీయంగా చర్చ మొదలైంది. రాష్ట్ర సాంస్కృతిక ప్రాధాన్యతను, చరిత్రను దృష్టిలో పెట్టుకుని పేరు మారిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన చేస్తోంది పినరయి విజయన్ ప్రభుత్వం. నిజానికి ఈ పేరు మార్పు డిమాండ్ చాలా రోజులుగా వినిపిస్తోంది. రాష్ట్ర సాంస్కృతిక, భాషావేత్తలు ఇదే విషయాన్ని ప్రభుత్వానికి సూచించారు. చరిత్రలో కేరళ పేరు "కేరళం"గానే ఉందని, మలయాళ భాష పరంగా చూసినా ఇదే సరైన పేరు అని తేల్చి చెబుతున్నారు భాషావేత్తలు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రసగించిన సమయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ పేరు మార్పుతో రాష్ట్ర సంస్కృతిని, చరిత్రను గౌరవించినట్టు అవుతుందని అన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు గర్వకారణమనీ చెప్పారు. 






"రాజ్యాంగంలోని మూడో అధికరణ ప్రకారం కేరళ పేరుని కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ అసెంబ్లీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని చోట్లా కేరళ పేరు మారాలని కోరుకుంటున్నాం. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లోనూ ఈ మేరకు మార్పులు జరగాలి. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో రాష్ట్రం పేరు కేరళగానే ఉంది"


- పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి


మద్దతుతో పాటు విమర్శలు..


ఈ ప్రతిపాదనకు ఎంత మద్దతు లభిస్తోందో అదే స్థాయిలో విమర్శలూ ఎదురవుతున్నాయి. కేరళంగా పేరు మార్చితే రాష్ట్ర సంస్కృతిని చాటి చెప్పినట్టు అవుతుందని, మూలాలు మర్చిపోలేదన్న సంకేతాలిచ్చినట్టవుతుందని అంటున్నారు మద్దతునిచ్చేవాళ్లు. అయితే...వ్యతిరేకించే వాళ్లు మాత్రం ఇప్పటికిప్పుడు పేరు మార్చితే పరిపాలనా వ్యవహారాల్లో చాలా మార్పులు చేయాల్సి వస్తుందని, అది కొత్త తలనొప్పి తెచ్చి పెడుతుందని వాదిస్తున్నారు. ఈ తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తరవాత కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. కేంద్రహోం మంత్రిత్వ శాఖ అనుమతినిస్తే పేరు మార్చేందుకు వీలవుతుంది. అసలు ఈ బిల్లుకి అసెంబ్లీలో తగిన మద్దతు లభిస్తుందా..? ఒకవేళ లభించినా కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలుపుతుందా..? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి ఆమోదం లభిస్తుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే...ప్రభుత్వం ఈ బిల్‌ని ప్రతిపాదించడం వల్ల ఆ దిశగా చర్చ అయితే మొదలైంది. 


Also Read: మణిపూర్‌ సాక్షిగా బీజేపీ భరత మాతను హత్య చేసింది, రాహుల్ సంచలన వ్యాఖ్యలు