Parliament Monsoon Session: 



చర్చ మొదలు..


మణిపూర్‌ సమస్య పరిష్కారంలో కేంద్రం విఫలమైందని విమర్శిస్తూ విపక్షాలు లోక్‌సభలో మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని మోదీ కచ్చితంగా మాట్లాడాల్సిందేనని మరోసారి తీర్మానం ప్రవేశపెట్టి డిమాండ్ చేశాయి విపక్షాలు. ముఖ్యంగా కాంగ్రెస్ ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉంది. నిజానికి మోదీ సర్కార్‌కి మెజార్టీ ఉన్నప్పటికీ...పదేపదే ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రాజకీయంగా ఢీకొడుతోంది. ఈ చర్చను మొదలు పెట్టిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కారణం ప్రధాని మోదీయే అని తేల్చి చెప్పారు. ఆయన మణిపూర్ విషయంలో మౌనంగా ఉండడం వల్లే ఇదంతా చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఒకే ఒక భారత్ అని గొప్పగా నినదించే బీజేపీ...మణిపూర్‌ని మాత్రం ముక్కలు చేసిందంటూ ఆరోపించారు. కొండ ప్రాంత ప్రజలు, లోయ ప్రాంత ప్రజల మధ్య విద్వేషాలు రాజేసిందని మండి పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ చర్చలో పాల్గొననున్నారు. అయితే...ఆయన రేపు (ఆగస్టు 10) పార్లమెంట్‌లో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చిస్తారని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే మోదీ నేతృత్వంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సమయంలోనే విపక్షాలపై మండి పడ్డారు మోదీ. ఇది తమ ప్రభుత్వానికి పెట్టిన పరీక్ష కాదని, ఇండియా కూటమిలో ఎవరెవరు ఎటు వెైపు ఉంటారో తేల్చే పరీక్ష అని విమర్శించారు. 


రాహుల్ ఎంట్రీ..


ఈ మధ్య కాలంలో ఎక్కడ పొలిటికల్ మీటింగ్స్ జరిగినా పదేపదే ఇండియా కూటమిపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు ప్రధాని. ముఖ్యంగా కాంగ్రెస్‌ని టార్గెట్ చేశారు. పాత కూటమి పేరు మార్చి ప్రజల్ని మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే ఆయన అవిశ్వాస తీర్మానంపై ఏం మాట్లాడతారన్న ఉత్కంఠ నెలకొంది. ముందుగా దీనిపై కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడనున్నారు. ఇప్పటికే మొదలైన చర్చలో పాల్గొన్న మంత్రి కిరణ్ రిజిజు...తప్పుడు సమయంలో ఇలాంటి తప్పుడు తీర్మానం ప్రవేశపెట్టినందుకు విపక్షాలు కచ్చితంగా బాధ పడతాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే లోక్‌సభ సభ్యత్వాన్ని తిరిగి పొందిన రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్‌లో మరోసారి తన వాయిస్ వినిపించనున్నారు. ఇది కూడా ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 4వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఇవాళే రాహుల్ ప్రసగించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అటు ప్రధాని మోదీ, ఇటు రాహుల్ గాంధీ ఒకరిపై ఒకరు చాలా కాలంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో వీళ్లిద్దరూ ఒకే అంశంపై పార్లమెంట్‌లో మాట్లాడడంపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే కాంగ్రెస్‌ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుందని, మణిపూర్‌ విషయంలో బీజేపీని వదిలే ప్రసక్తే లేదని సీనియర్ నేతలు చెబుతున్నారు. మరి రాహుల్ గాంధీ ఏ వ్యూహంతో ముందుకెళ్తారో చూడాల్సి ఉంది. 


Also Read: Rahul Gandhi: భారత్ జోడో యాత్ర రెండో దశకు ప్లాన్ - ఈసారి గుజరాత్ నుంచి మేఘాలయ వరకు