Rahul Gandhi: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తొలి దశకు విశేష స్పందన లభించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రెండోదశ యాత్ర చేపట్టి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈక్రమంలోనే భారత్ జోడో యాత్ర రెండో దశకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గుజరాత్ నుంచి మేఘాలయ వరకు రెండో దశను ప్లాన్ చేసినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మంగళవారం తెలిపారు. అదే సమయంలో మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్రలో పాదయాత్ర చేస్తారని ఆయన తెలిపారు. 


ఈ యాత్రకు సంబంధించిన మహారాష్ట్రలోని ప్రతీ లోక్ సభ స్థానానికి 48 మంది పార్టీ పరిశీలకులను నియమించినట్లు పటోలే తెలిపారు. ఈ పరిశీలకులు ఆరు రోజుల్లోగా క్షేత్రస్థాయి పరిస్థితిపై నివేదికను సమర్పించనున్నారు. ఆ తర్వాత అంటే ఆగస్టు 16వ తేదీన కోర్ కమిటీ సమావేశం జరగనుంది. తూర్పు విదర్భలో యాత్రకు తాను, ముంబైలో వర్ష గైక్వాడ్, పశ్చిమ విదర్భలో విజయ్ వాడెట్టివార్, ఉత్తర మహారాష్ట్రలో బాలాసాహెబ్ థోరట్, మరఠ్వాడాలో అశోక్ చవాన్, పశ్చిమ మహారాష్ట్రలో పృథ్వీరాజ్ చవాన్  నాయకత్వం వహించబోతున్నట్లు పటోలే తెలిపారు. అనంతరం నేతలంతా కలిసి కొంకణ్‌కు వెళ్లనున్నారు. పాదయాత్ర అనంతరం యాత్ర బస్సును చేపట్టబోతున్నట్టు కూడా ఆయన తెలిపారు.  


రాహుల్ గాంధీ తన రెండో దశ యాత్రను రాష్ట్రం నుంచి ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించినట్లు గుజరాత్ కాంగ్రెస్ ప్రకటించిన మరుసటి రోజే ఇదంతా జరిగింది. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్‌ల పుట్టిన గుజరాత్‌ నుంచి భారత్‌ జోడో యాత్ర రెండో దశను ప్రారంభించాలని రాహుల్‌ గాంధీకి ఆహ్వానం పంపామని, రెండో దశ రాష్ట్రం నుంచే ప్రారంభం కావాలని గుజరాత్‌ ప్రతిపక్ష నేత అమిత్‌ చావ్డా పేర్కొన్నారు. రెండవ దశ యాత్ర ఈసారి తూర్పు నుంచి పశ్చిమం వరకు ఉన్న రాష్ట్రాలను కవర్ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదటి దశ సెప్టెంబర్ 2022లో తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. జనవరి 30న జమ్మూ, కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ముగిసింది. ఈ పాదయాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేసింది.


యాత్ర ముగిసిన రెండు నెలల తర్వాత రాహుల్ గాంధీ  'మోదీ' ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల కారణంగా.. పరువు నష్టం కేసులో దోషిగా కోర్టులు తేల్చాయి. ఈక్రమంలోనే రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించాయి. దోషిగా తేలడంతో లోక్‌సభ ఎంపీగా కూడా అనర్హత వేటు పడింది. అయితే గత వారం సుప్రీం కోర్టు రాహుల్ పై స్టే విధించింది. సోమవారం లోక్‌సభ ఎంపీగా తిరిగి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. ఇదిలా  రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విఫలమైందని, మహారాష్ట్ర కాంగ్రెస్‌ అదే పరిస్థితిలో ఉందని బీజేపీ  విమర్శలు చేసింది.  యాత్ర ముగిసిన తర్వాత ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు పార్టీని వీడారని ఎద్దేవా చేసింది.