Karnataka News:


"అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరూ ఆనందంగా ఉండండి. పాఠశాలలో నా కోసం కట్టిన ఫీజు వెనక్కి తీసుకోండి. అంతేసి ఫీజులు కట్టి మీరు నన్ను దుఃఖంలో పడేశారు. ఎవరూ బాధపడవద్దు."


కర్ణాటకకు చెందిన ఓ బాలుడు రాసిన డెత్‌నోట్ ఇది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ కళ్ల నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ పసివాడి హృదయం ఎంతగా గాయపడితే ఈ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంటాడు అని అంతా ఆలోచిస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసా?







ఇదీ జరిగింది


కర్ణాటక బెంగళూరు సమీపంలోని హొసకోటేకి చెందిన రమేశ్, మంజుల దంపతుల కుమారుడు పూర్వజ్‌ (14). ఈ కుర్రాడు ఉళ్లాలలోని శారదా విద్యానికేతన్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం పూర్వజ్‌ తల్లి మంజుల పుట్టిన రోజు. దీంతో అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాడు.


తల్లితో ఓసారి మాట్లాడతానని, మొబైల్‌ ఇవ్వాలని బాలుడు హాస్టల్‌ వార్డెన్‌ను అడిగాడు. కానీ అందుకు వార్డెన్‌ ససేమిరా అన్నాడు. "ఇవాళ మా అమ్మ పుట్టినరోజు. అమ్మతో మాట్లాడాలి. ఒక్కసారి మొబైల్‌ ఇవ్వండి." అని పూర్వజ్ ప్రాధేయపడ్డాడు. అయినా ఆ వార్డెన్ మనసు కరగలేదు.


ఆవేదనతో


పుట్టినరోజు నాడు అమ్మకు శుభాకాంక్షలు చెప్పలేకపోయానని తీవ్ర ఆవేదనకు గురైన పూర్వజ్‌ శనివారం రాత్రి డెత్‌నోట్‌ రాసి హాస్టల్‌ గదిలో ఉరి వేసుకున్నాడు. అయితే పూర్వజ్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే హాస్టల్‌లో కలకలం చెలరేగింది.


బాలుడి ఆత్మహత్యకు విద్యా సంస్థ ప్రిన్సిపాల్, హాస్టల్‌ వార్డెనే కారణమని మంజుల సోదరుడు అరుణ్‌ కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థి డెత్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ డెత్‌నోట్‌లో బాలుడు రాసిన మాటలు వారి తల్లిదండ్రులు సహా అందరికీ కన్నీళ్లు తెప్పించాయి.


Also Read: Supreme Court: 'సహజీవనం'పై సుప్రీం సంచలన వ్యాఖ్యలు- వారసత్వ ఆస్తిలో ఆ పిల్లలకూ హక్కు!


Also Read: Viral News: 'మాకు భార్యలు వద్దు బాబోయ్'- భార్యా బాధితుల సంఘం వింత పూజలు