ABP Network with IIM Indore: ప్రముఖ మీడియా సంస్థ ABP నెట్‌వర్క్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) ఇండోర్ మధ్య ఓ కీలక అవగాహన ఒప్పందం Memorandum of Understanding (MoU) జరిగింది. ఫేక్ న్యూస్‌ను గుర్తించడంలో ఇరు సంస్థలు కలిసి పనిచేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు.
ఇదే లక్ష్యం
నకిలీ వార్తలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా కలిసికట్టుగా పని చేయడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. నకిలీ వార్తలను ఎదుర్కోవడంలో విధాన స్థాయి పాలసీలను విశ్లేషించడం, సిఫార్సు చేయడంపై కూడా ఈ రెండు సంస్థలు దృష్టి సారించనున్నాయి.
ఈ భాగస్వామ్యం ద్వారా ABP నెట్‌వర్క్, IIM ఇండోర్ రెండూ పరస్పర సహకారంతో పని చేయనున్నాయి. ఒక మంచి సమాచార వ్యవస్థకు అవసరమైన ప్రక్రియను, విధానాలను అభివృద్ధి చేయడం కోసం ఉమ్మడి పరిశోధనను నిర్వహించనున్నారు.
డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన మాడ్యూళ్లను మరింత అభివృద్ధి చేస్తారు. IIM ఇండోర్‌తో ABP నెట్‌వర్క్‌లోని సిబ్బందికి స్వల్పకాలిక శిక్షణ కూడా అందించనున్నారు. రెండు సంస్థల మధ్య పరస్పర ప్రయోజనాల కోసం జాయింట్ సెమినార్‌లు కూడా నిర్వహించనున్నారు.
కలిసికట్టుగా
ABP నెట్‌వర్క్
ఒక వినూత్న మీడియా, కంటెంట్ క్రియేషన్ సంస్థగా ABP నెట్‌వర్క్ గుర్తింపు పొందింది. ప్రసార & డిజిటల్ రంగంలో విశ్వసనీయ వార్తలను అందిస్తోంది. తన న్యూస్ ఛానళ్లు, డిజిటల్ వేదికల ద్వారా దేశంలోని 53.5 కోట్ల మందికి ABP నెట్‌వర్క్ చేరువైంది. ABP నెట్‌వర్క్ దాదాపు 100 ఏళ్లుగా మీడియా రంగంలో రారాజుగా వెలుగుతోంది.