Karnataka Loudspeaker Row: లౌడ్‌స్పీకర్ల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
కఠిన చర్యలు
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్లను వినియోగించరాదని ప్రభుత్వం తెలిపింది. అనుమతి పొందిన వారు తప్ప మిగిలిన వారు లౌడ్ స్పీకర్ లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను ఉపయోగించరాదని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.
అలా మొదలైంది
మే 3వ తేదీలోగా మహారాష్ట్రలోని మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఏప్రిల్ 12న రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే అల్టిమేటం ఇచ్చారు. లేకపోతే ఎంఎన్ఎస్ కార్యకర్తలు లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా వినిపిస్తారని ఆయన హెచ్చరించారు. దీంతో లౌడ్ స్పీకర్ల గొడవ మొదలైంది.
కర్ణాటకలో
ఇది జరిగిన కొద్ది రోజులకే లౌడ్ స్పీకర్ల వివాదం కర్ణాటకకు వ్యాపించింది. హిందూ కార్యకర్తలు అజాన్ (ముస్లింల ప్రార్థన)కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ చాలీసాను పఠిస్తామని ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
శ్రీరామ సేన వ్యవస్థాపకుడు ప్రమోద్ ముథాలిక్ ఈ కార్యక్రమాన్ని మైసూర్ జిల్లాలోని ఓ ఆలయంలో ఇటీవల ప్రారంభించారు. మసీదుల్లోని అజాన్‌కు వ్యతిరేకంగా దాదాపు 1000 ఆలయాల్లో ఈరోజు హనుమాన్ చాలీసా, సుప్రభాతాన్ని వినిపిస్తామని ఆయన అన్నారు.
సీఎంకు సవాల్
ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చూపించిన తెగువను కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, హోంమంత్రి అరాగ జ్ఞానేంద్ర ప్రదర్శించాలని ప్రమోద్ కోరారు. ఇటీవల యూపీలో అనుమతి లేని లౌడ్ స్పీకర్లను తొలిగించి, ఆధ్యాత్మిక ప్రాంతాల్లోని లౌడ్ స్పీకర్ల సౌండ్ తగ్గించాలని యోగి ఆదేశించారు.
కఠిన చర్యలు
రాష్ట్రంలో ఎవరైనా లౌడ్ స్పీకర్లతో శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక హోంమంత్రి హెచ్చరించారు. ఈ మేరకు కోర్టు ఇచ్చిన ఆదేశాలు అందరూ పాటించాలని కోరారు. శాంతి భద్రతలను కాపాడేందుకు ఎలాంటి కఠిన చర్యలైనా చేపడతామన్నారు.
లౌడ్ స్పీకర్లపై ఇప్పటివరకు మొత్తం 301 నోటీసులు పంపినట్లు ఆయన తెలిపారు. నగరంలోని 59 పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, 12 పరిశ్రమలు, 83 ఆలయాలు, 22 చర్చిలు, 125 మసీదులకు ఈ నోటీసులు పంపించారు. మల్లేశ్వరంలోని మరిన్ని ఆలయాలకు కూడా ఈ నోటీసులు పంపింది ప్రభుత్వం. రాత్రి 10 గంటల నుంచి ఉదయ 6 గంటల వరకు లౌడ్‌స్పీకర్ల వినియోగంపై నిషేధం విధిస్తూ ఎట్టకేలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
వరుస వివాదాలు
ప్రస్తుతం కర్ణాటక వరుస వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. హిజాబ్ వివాదం, భజరంగ్ దళ్ కార్యకర్తల హత్య, హుబ్బళి మత ఘర్షణలతో కర్ణాటక పోలీసులకు వరుస సవాళ్లు ఎదురయ్యాయి.
Also Read: Ola Uber Customer Complaints: ఓలా, ఉబర్ క్యాబ్‌లకు కేంద్రం షాక్- కఠిన చర్యలు తప్పవని వార్నింగ్!
Also Read: Sedition Law: రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు స్టే- అప్పటివరకు నో FIR!