Ola Uber Customer Complaints: ఓలా, ఉబర్ సహా పలు క్యాబ్ సంస్థలపై కేంద్రం సీరియస్ అయింది. క్యాబ్ సంస్థలు ఎడాపెడా దోచేస్తున్నాయని.. పీక్ అవర్స్, ఏసీ ఆన్‌ చేస్తే డబ్బులంటూ ప్రయాణికులను పీల్చి పిప్పి చేస్తున్నాయని కస్టమర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో కేంద్రం రంగంలోకి దిగింది. దేశీయ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.


కఠిన చర్యలు


కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలైన ఓలా, ఉబెర్‌, జుగ్నూ, మేరు సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీలో ప్రధానంగా క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలకు సంబంధించి కార్యకలాపాల నిర్వాహణ, ఫేర్‌ ప్రైసింగ్‌ అల్గారిథమ్‌, డ్రైవర్స్‌, పేమెంట్స్‌ స్ట్రక్చర్స్‌ వివరాల్ని వెంటనే అందించాలని ఆదేశించినట్లు పలు నివేదికలు వచ్చాయి. కస‍్టమర్లకు తలెత్తున్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేంద్రం ఈ సమావేశంలో హెచ్చరించింది. 


అదనపు ఛార్జీలు


గత నెలలో లోకల్‌ సర్కిల్‌ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2020 ఉన్నప్పటికీ డ్రైవర్‌లు ఇష్టం వచ్చినట్లు రైడ్ క్యాన్సిలేషన్ చేస్తున్నారని, అందుకు అదనంగా తమ వద్ద నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు 71 శాతం మంది కస్టమర్లు ఫిర్యాదు చేశారు.


ముఖ్యంగా ఏదైనా అర్జెంట్ పని ఉండి క్యాబ్ బుక్ చేస్తుంటే.. చాలా మంది డ్రైవర్‌లు రైడ్ క్యాన్సిల్ చేయడం వల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రికి, ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు దీని వల్ల నష్టపోతున్నట్లు కస్టమర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిపై క్యాబ్ సంస్థలు దృష్టి పెట్టాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. వీటిపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వినియోగదారులు వాపోతున్నారు.


దోచెయ్ దోచెయ్


డిమాండ్‌ పేరుతో క్యాబ్‌ సంస్థలు రెచ్చిపోతున్నాయి. అత్యవసరంగా పనిపై బయటికెళ్లాలంటే మండే ఎండలకు భయపడి ఏసీ ఆన్‌ చేస్తే చార్జీల మోత మోగిస్తున్నాయి. పీక్ అవర్సే కాదు..సాధారణ సమయాల్లో సైతం అదనంగా  వసూలు చేస్తున్నారని ప్రయాణికులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకప్పుడు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా, అందుబాటు ధరల్లో ఉన్న క్యాబ్‌లు ఇప్పుడు అదే కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నాయి.


Also Read: Sedition Law: రాజద్రోహం చట్టంపై సుప్రీం కోర్టు స్టే- అప్పటివరకు నో FIR!


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 2,897 మందికి కరోనా- 54 మంది మృతి