Karnataka Chief Minister: కర్ణాటకలో ఐదు రోజుల ఉత్కంఠకు తెరదించుతూ కాంగ్రెస్ నూతన ముఖ్యమంత్రి పేరును ఖరారు చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆదేశాన్ని మరోసారి సిద్ధరామయ్యకు అప్పగించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సిఎం రేసులో సిద్ధరామయ్య వాదన బలంగా ఉందని, తుది ఫలితం కూడా అదేనని ఏబీపీ దేశం రెండు రోజులు ముందే ధృవీకరించింది. ఈరోజు సాయంత్రం బెంగళూరులో జరగనున్న కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశం వరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 76 ఏళ్ల సిద్ధరామయ్య కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ అని పలుచుకునే డీకే శివకుమార్‌ను ఎలా పక్కకు నెట్టేసి సీఎం సీటును అధిష్టిస్తున్నారో ఓసారి చూద్దాం.
ఎక్కువ మంది శాసనసభ్యుల మద్దతు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత అంటే మే 14వ తేదీ ఆదివారం బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో తీర్మానం చేసి సీఎంను నిర్ణయించే హక్కు కాంగ్రెస్ అధ్యక్షుడికి కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కాంగ్రెస్ పరిశీలకులు తెలుసుకున్నారు. ఇందు కోసం రహస్య ఓటింగ్ కూడా ఏర్పాటు చేశారు. సీక్రెట్ బ్యాలెట్ కు సిద్ధరామయ్య కూడా మద్దతిచ్చారని తెలుస్తోంది. మరుసటి రోజు అంటే సోమవారం ముగ్గురు కాంగ్రెస్ పరిశీలకులు ఢిల్లీ చేరుకుని మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమై ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని చెప్పారు. ఈ రహస్య ఓటింగ్ లో సిద్ధరామయ్యకు ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు వచ్చిందని సమాచారం.
Also Read: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పేరు ఖరారు!
అహింద ఫార్ములా..!
సిద్ధరామయ్యను నాయకుడిగా మార్చింది ఆయన అహిందా ఫార్ములా. అహిందా (మైనారిటీ, దళిత, వెనుకబడిన) ఫార్ములా కారణంగా, ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇతర వెనుకబడిన తరగతుల‌్లో ఆయనకు విస్తృతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. కురుబ ఓబీసీ కులానికి చెందిన సిద్ధరామయ్య రాష్ట్రానికి మొదటి లింగాయత్ , వొక్కలిగయేతర ముఖ్యమంత్రి.
గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం
కర్ణాటకలో ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చోవడం అంత తేలికైన విషయం కాదు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు తమ పదవీ కాలం పూర్తికాక ముందే పదవి నుంచి వైదొలిగారు. కొందరు సీఎంలు కేవలం ఏడు రోజులు మాత్రమే పదవిలో కొనసాగారు. మరికొందరు కేవలం 6 రోజుల్లోనే తన కుర్చీని వదిలేశారు. ఐదేళ్ల పాలనలో దాదాపు నలుగురు ముఖ్యమంత్రులను మార్చిన ఘనత కూడా కర్ణాటకకు ఉంది. అయితే నాలుగు సార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా నిలిచారు బీఎస్ యడ్యూరప్ప. ఆయన 2007లో సీఎం అయి కేవలం 7 రోజులు మాత్రమే పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2008లో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి ఆయన మూడేళ్ల పాటు అధికారంలో కొనసాగారు. మూడోసారి యడ్యూరప్ప 6 రోజులు తన కుర్చీలో కూర్చుంటే, నాలుగోసారి 2 సంవత్సరాలు సీఎం పదవిలో కొనసాగారు. కడిదల మంజప్ప కేవలం 3 నెలలు మాత్రమే సీఎం పదవిలో కొనసాగారు. అలాగే ఎస్ ఆర్ కాంతి నాలుగు నెలల పాటు సీఎంగా కొనసాగారు. అంతేకాకుండా జగదీష్ షెట్టర్ 14 నెలల్లో సీఎం పదవి నుండి వైదొలిగారు.
మాజీ సీఎం ఎస్ నిజలింగప్ప(1962 జూన్ 21 నుంచి 1968 మే 28 వరకు), దేవరాజ్ ఉర్స్(1972 మార్చి 20 నుంచి 1977 డిసెంబర్ 31 వరకు), సిద్ధరామయ్య(2013 నుండి 2018 వరకు) పదవీ కాలం పూర్తయ్యే వరకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. సిద్ధరామయ్య గత 45 సంవత్సరాలలో 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసిన మొదటి ముఖ్యమంత్రి కావడం ఆలోచించదగ్గ విషయం. దేవరాజ్ ఉర్స్ తర్వాత 5 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసిన కర్ణాటకలో రెండో ముఖ్యమంత్రి కూడా ఈయనే. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా రెండు సార్లు డిప్యూటీ సీఎంగా పని చేశారు. 2009 నుంచి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా కొనసాగుతున్నారు.
Also Read: సీఎం రేసులో డీకే శివకుమార్ ఎందుకు వెనకబడ్డారు?
సిద్ధారామయ్యకు ఉన్న క్లీన్ ఇమేజ్..
సిద్ధరామయ్యకు ఉన్న క్లీన్ ఇమేజ్ ఆయనకు మరింత బలం. సిద్ధరామయ్య ప్రత్యర్థి అయిన డీకే శివకుమార్ పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఆయన జైలుకు కూడా వెళ్లారు. డీకే శివకుమార్‌ను సీఎం చేస్తే, ఆయనపై ఉన్న కేసులు కదలించి బీజేపీ చికాకు పెడుతుందని కాంగ్రెస్ కు భయం. డీకే శివకుమార్ ఏదైనా కేసులో మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తే, అది కాంగ్రెస్‌కు గట్టి ఎదురు దెబ్బగా మారుతుందని అంచనా వేసింది. ముఖ్యంగా అవినీతిపై బీజేపీ చాలా దూకుడుగా అంటుందని ఇలాంటి పరిస్థితుల్లో డీకే శివకుమార్ ను సీఎం చేసి లేనిపోని సమస్యల్లో ఇరుక్కోవడం ఎందుకని కాంగ్రెస్ భావనగా కొందరు విశ్లేషిస్తున్నారు. అందుకే ఆ పదవి సిద్దరామయ్యకు వరించినట్టు చెబుతున్నారు.