Jammu Terrorist Attack: ప్రధాని మోదీ జమ్మూ పర్యటనకు ముందు ఉగ్రమూకలు మరోసారి చెలరేగాయి. జమ్మూలో ఆర్మీ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడులు దాడులకు తెగబడ్డారు. ఈ ప్రమాదంలో ఒక జవాను ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఈ ఉగ్రదాడి జరిగినట్లు సమాచారం. ఉగ్రవాదుల కదలికలపై పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా ఓ చోట ఉగ్రదాడి జరగగా, మరోచోట ఎన్‌కౌంటర్ జరిగిందని జమ్మూ పోలీసులు తెలిపారు.
తెల్లవారుజామునే ఉగ్రదాడి..
జమ్మూలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ఉదయం షిఫ్ట్ డ్యూటీకి హాజరయ్యేందుకు శుక్రవారం ఉదయం ఓ బస్సులో బయలుదేరింది. కొంతసేపటికే 4 గంటల 25 నిమిషాల ప్రాంతంలో ఛద్ధా క్యాంపునకు సమీపంలో ఉగ్రవాదులు బస్సుపై దాడి చేశారు. వెంటనే సీఐఎస్ఎఫ్ అప్రమత్తమై ఎదురుకాల్పులు జరపడంతో ఉగ్రవాడులు అక్కడి నుంచి పరారయ్యారని జాతీయ మీడియా ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. కానీ ఈ ఉగ్రదాడిలో ఓ సీఐఎస్ఎఫ్ జవాను అమరుడు కాగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అమరుడైన జవాన్ సీఐఎస్ఎఫ్‌లో ఏఎస్ఐగా ఉన్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు.
ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఉగ్రదాడి, ఎన్‌కౌంటర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 24న జమ్మూలోని సాంబా జిల్లాను సందర్శించాల్సి ఉంది. కానీ ప్రధాని జమ్మూ కశ్మీర్ పర్యటనకు ముందు శుక్రవారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య సుంజ్వాన్ ప్రాంతంలో మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. పాకిస్థాన్‌కు చెందిన జైష్-ఏ-మహ్మద్ (జేఎం) ఉగ్రవాదులు జమ్మూలో దాడులకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఎదురుపడటంతో ఒక్కసారిగా జేషే గ్రూప్ జవాన్లపై కాల్పులు మొదలుపెట్టగా.. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు అధికారిక వర్గాల సమాచారం.
Also Read: Tirupati Crime : నకిలీ పోలీసులు రూ.90 లక్షలు కొట్టేశారు, ఆ ఒక్క తప్పుతో దొరికేశారు