Tirupati Crime : పోలీసులమని చెప్పి రూ.90 లక్షలు కాజేసిన దొంగల ముఠాను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.88 లక్షలు, ఓ ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు.‌ బంగారం కొనుగోలు చేసేందుకు దుకాణం యజమాని సతీష్ ఇచ్చిన రూ.90 లక్షల నగదుతో మొహర్ శ్రీనివాస్ నర్సారావుపేట నుంచి ఈనెల 8వ తేదీ తిరుపతికి బయలుదేరారు. నర్సారావుపేట నుంచి శ్రీనివాస్ బయలు దేరినప్పటి నుంచి ముద్దాయిలైన తిర్గిక శ్రీనివాస రావు, మిరిశెట్టి శ్రీనులు AP03 FQ 5529 ఇన్నోవా కారును బాడుగకు తీసుకోని వీరనాల గంగాధర్, సయ్యద్ హుసైన్ బాషా, పఠాన్ రసూల్, సయ్యద్ హుసైన్ బాషా, మున్నంగి రమేష్ లను వెంట పెట్టుకొని ఈ నెల 9వ తేదీ ఉదయం ఆరు గంటలకు తిరుపతికి చేరుకున్నారు. మొహర్ శ్రీనివాస్ ఉదయ్ ఇంటర్నేషనల్ ముందు బస్సు దిగగానే ముద్దాయిలు తాము ఐడీ పార్టీ పోలీసులమని, తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించాలని మొహర్ ను బెదిరించారు. 



10 రోజుల్లోనే ఛేదించిన పోలీసులు 


వెంటనే అతనిని కారులో ఎక్కమని హుకూం జారీ చేశారు నిందితులు. కారులో ఎక్కినా అనంతరం కేకలు వేస్తే చంపేస్తామని బెదిరించి, మొహర్ కళ్లకు గుడ్డ కట్టారు. మొహర్ శ్రీనివాస్ వద్ద ఉన్న రూ.90 లక్షలతో పాటుగా అతడి మొబైల్ ఫోన్ ను తీసుకోని, బెంగళూరు హైవే వైపు వెళ్లి కాణిపాకం సమీపంలోని ఓ గ్రామం వద్ద మొహర్ ను విడిచిపెట్టారు. కొంత దూరంలోని నీటి కుంటలో అతని మొబైల్ ఫోన్ పడేశారు. ఈ ఘటన నుంచి తేరుకున్న మొహర్ శ్రీనివాస్ వెంటనే తన యజమాని సతీష్ కు సమాచారం ఇవ్వగా ఈ నెల‌ 11వ తేదీన తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి 10 రోజుల వ్యవధిలో నిందితులను పట్టుకున్నారు. 


ఎలా పట్టుకున్నారంటే


ముద్దాయిలు నేరానికి వినియోగించిన ఇన్నోవా కారు ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. దొంగలించిన సొమ్మును బంగారుగా మార్చుకొని అదే వాహనంలో వస్తుండగా గురువారం మధ్యాహ్నం 12.15కి చెన్నై కోల్ కతా జాతీయ రహదారి 16లోని నాయుడుపేట క్రాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఏ-1 ముద్దాయి అయినా తిర్గిక శ్రీనివాసరావును విచారించారు పోలీసులు. ఇతను నర్సారావుపేటలో సుమారు 12 సంవత్సరాల నుంచి బంగారం షాపు పెట్టుకొని జీవిస్తూ ఉన్నాడు. గతేడాది  ఇతని అసిస్టెంటు లక్ష్మణ్ ద్వారా చెన్నై నుంచి బంగారం కడ్డీలను తెప్పిస్తుండగా సదరు లక్ష్మణ్ ను విజయవాడ కస్టమ్స్ పట్టుకుని కేసు నమోదు చేసి బంగారం సీజ్ చేశారు. శ్రీనివాసరావు వ్యాపారం దెబ్బతిని ఆర్థికంగా చితికి పోయింది. నర్సరావుపేట బంగారు వ్యాపారాస్తులే సమాచారమిచ్చి లక్ష్మణ్ ను పట్టించినట్లు తిర్గిక శ్రీనివాస్ తెలుసుకున్నాడు. అదే తరహాలో బంగారు వ్యాపారస్తులు డబ్బులు పంపి బంగారం తెచ్చే విషయం తెలుసుకుని దొడ్డి దారిలో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని మార్కాపరానికి చెందిన తన బంధువైన దుర్గారావుతో కలిసి పథకం పన్నీ దోపిడీకి పాల్పడినట్లు నిందితుడు తిర్గిక శ్రీనివాసరావు విచారణలో చెప్పాడు.