విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సమంత(Samantha) జంటగా త్వరలోనే ఓ కొత్త చిత్రం పట్టాలెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించనున్నారు. విజయ్ దేవరకొండకు ఇది 11వ చిత్రమిది. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ‘ఉప్పెన’ దర్శకుడు సానా బుచ్చిబాబు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు హరీశ్ శంకర్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడికి చిత్ర నిర్మాతలు స్క్రిప్ట్ అందజేశారు. ప్రముఖ దర్శకులు కొరటాల శివ, కె.ఎస్. రవీంద్ర (బాబీ) తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, సమంత మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గోలేదు. దీంతో వివిధ మీడియా సంస్థలు ప్రముఖంగా ఈ విషయాన్ని ప్రస్తావించాయి. సమంత ఎందుకు గైర్హజరైందంటూ కథనాలు ప్రచురించాయి. 


ఈ వార్తలపై విజయ్ దేవరకొండ ఫన్నీగా స్పందించారు. పూజా కార్యక్రమానికి సంబంధించిన ఓ ఫొటోలో సమంత, వెన్నెల కిశోర్‌ల ఫొటోలను ఫొటోషాప్ ద్వారా అతికించి.. ఇదే ఒరిజినల్ ఫొటో అంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫొటో చూసి నెటిజనులు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఫొటోషాప్‌లో భలే ఎడిట్ చేశావంటూ విజయ్‌ను పొగిడేస్తున్నారు. మొన్నటి వరకు షూటింగ్‌లతో బిజీగా గడిపిన సమంత ప్రస్తుతం దుబాయ్‌లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. అందుకే, ఆమె ఈ చిత్రం పూజా కార్యక్రమానికి హాజరుకాలేకపోయినట్లు తెలిసింది.




విజయ్, సమంత కలిసి గతంలో ‘మహానటి’ చిత్రంలో నటించారు. ఇక తాజా సినిమా విషయానికి వస్తే.. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ నెలలో కశ్మీర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత విశాఖ, కేరళలోని అలెపీలో షూటింగ్ చేయనున్నారు. ఇందులో కశ్మీర్ యువతిగా సమంత నటించనున్నారని సమాచారం. అయితే... ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు. 


Also Read: విజయ్ దేవరకొండ - సమంత - ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ షూటింగ్ షురూ


'లైగర్' తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో 'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్ దేవరకొండ, 'రంగస్థలం' తర్వాత సమంత నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి 'ఖుషి' టైటిల్ ఖరారు చేసినట్టు భోగట్టా. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా టైటిల్ గురించి కూడా ఏమీ చెప్పలేదు. త్వరలో వెల్లడిస్తారేమో చూడాలి. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.


Also Read: 'ఓ మై డాగ్' రివ్యూ: సూర్య, జ్యోతిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?