సినిమా రివ్యూ: 'ఓ మై డాగ్'
రేటింగ్: 2/5
నటీనటులు: విజయ్ కుమార్, అరుణ్ విజయ్, 'మాస్టర్' అర్ణవ్ విజయ్, వినయ్ రాయ్, మహిమా నంబియార్, భానుచందర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: గోపీనాథ్ 
సంగీతం: నివాస్ కె. ప్రసన్న 
నిర్మాతలు: సూర్య, జ్యోతిక
దర్శకత్వం: సరోవ్ షణ్ముగం 
విడుదల తేదీ: ఏప్రిల్ 21, 2022 (అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో)


Oh My Dog Movie Review: ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ కుమార్ (Vijay Kumar), ఆయన కుమారుడు - తెలుగులో 'బ్రూస్ లీ', 'సాహో ' చిత్రాల్లో నటించిన అరుణ్ విజయ్ (Arun Vijay), మనవడు అర్ణవ్ విజయ్ (Arnav Vijay) నటించిన సినిమా 'ఓ మై డాగ్' (Oh My Dog). అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందిన చిత్రమిది (Amazon Original Movie Oh My Dog Review). ప్రముఖ తమిళ హీరో సూర్య, ఆయన సతీమణి జ్యోతిక నిర్మించారు. గురువారం విడుదలైంది. ఓటీటీలో వీక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?


కథ: వ్యాపారవేత్త ఫెర్నాండో (వినయ్ రాయ్)కు చెందిన శునకాలు వరుసగా ఆరు సార్లు ఇంటర్నేషనల్ ఎజిలిటీ ఛాంపియ‌న్‌షిప్‌ ఫర్ డాగ్స్ టైటిల్ విజేతలుగా నిలుస్తాయి. ఏడోసారి టైటిల్ అందుకుని, ప్రపంచ రికార్డు సృష్టించాలనుకున్న ఫెర్నాండో కల కలగా మిగలడానికి కారణం అవుతుంది చూపులేని ఓ శునకం. దాని పేరు సింబ. అది విజేతగా నిలవడం వెనుక అర్జున్ ('మాస్టర్' అర్ణవ్ విజయ్) చేసిన కృషి ఏమిటి? కుమారుడి స్కూల్ ఫీజ్ సమయానికి కట్టలేక, ఇంటిపై తీసుకున్న అప్పు తీర్చలేక ఇబ్బందులు పడుతున్న మిడిల్ క్లాస్ ఫాదర్ శంకర్ (అరుణ్ విజయ్)... కుక్కపిల్లను పెంచుకోవాలన్న కుమారుడి ఆశ తెలుసుకుని ఏం చేశాడు? సింబ విజేతగా నిలవడానికి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. (Oh My Dog Telugu Movie Review)


విశ్లేషణ: స్కూల్‌కు వెళ్లే పిల్లాడు, ఒక మూగ జంతువుకు మధ్య అనుబంధం నేపథ్యంలో రూపొందిన సినిమా (Oh My Dog Movie). సినిమా ప్రారంభమైన కాసేపటికి ముగింపు ఎలా ఉంటుందో ప్రేక్షకులకు సులభంగా అర్థమవుతుంది. క్లైమాక్స్ ఏంటనేది ఊహించగలిగినా... కథను ఆసక్తికరంగా నడపవచ్చు. ఆ విషయంలో దర్శకుడు సరోవ్ షణ్ముగం విఫలమయ్యారు.


'ఓ మై డాగ్' చిత్రంలో మధ్య మధ్యలో కొన్ని మెరుపులు తప్పితే... సరోవ్ షణ్ముగం ప్రతిభ చూపించిన సన్నివేశాలు చాలా తక్కువ. కథలో కామెడీకి స్కోప్ ఉంది. 'సిసింద్రీ'లో చిన్న పిల్లాడిని పట్టుకోవడం కోసం గిరిబాబు, తనికెళ్ళ భరణి అండ్ కో పడే తిప్పలు నవ్విస్తాయి. అటువంటి సీన్స్‌లో ఈ సినిమాలో ఉన్నాయి. అయితే, ప్రేక్షకులను నవ్వించేవి తక్కువ. ఆ ట్రాక్ ఇంకా బెట‌ర్‌గా రాసుకోవాల్సింది. కుక్క పిల్లకు, పిల్లాడికి మధ్య ఎమోషనల్ బాండింగ్ కూడా సరిగా రాసుకోలేదు. సో సోగా రాసుకుని తీసినట్టు ఉంది. సంగీతం, ఛాయాగ్రహణం, సాంకేతిక విలువలు కూడా సోసోగా ఉన్నాయి.


సినిమాలో దర్శకుడి కంటే నటీనటులు ఎక్కువ ఆకట్టుకుంటారు. సినిమా టైటిల్ చూసి కథంతా కుక్కపిల్ల చుట్టూ తిరుగుతుందని ఈజీగా చెప్పేస్తారు. సింబ పాత్రలో ఒక చిన్న పప్పీ, ఒక సైబీరియన్ హస్కీ కనిపిస్తాయి. రెండూ ముద్దు ముద్దుగా ఉన్నాయి. అర్ణవ్ విజయ్ చక్కగా నటించారు. పిల్లాడు కాబట్టి స్కూల్ సన్నివేశాల్లో నటించడం పెద్ద కష్టం ఏమీ కాకపోవచ్చు. కానీ, ఆ వయసుకు ఎమోషనల్ సీన్స్ చేయడం చెప్పుకోదగ్గ విషయం. తన వరకు బాగా చేశాడు. అర్ణ‌వ్‌ది ఎక్స్‌ప్రెసివ్‌ ఫేస్. భవిష్యత్తులో నటుడిగా ఇంకా ప్రతిభ చూపిస్తాడని చెప్పవచ్చు. మిడిల్ క్లాస్ తండ్రిగా అరుణ్ విజయ్ సెటిల్డ్‌గా నటించారు. కథను డామినేట్ చేయాలని చూడకుండా... పాత్ర పరిధి మేరకు నటించారు. తెలుగులో ఆయన చేసిన పాత్రలకు భిన్నమైన పాత్ర ఇది. అందువల్ల, కొత్తగా కనిపించే అవకాశం ఉంది. వినయ్ రాయ్ గెటప్ వింతగా ఉంటుంది. నటన పర్వాలేదు. విజయ్ కుమార్, భానుచందర్, మనోబాల తదితరులు సన్నివేశాలకు అనుగుణంగా నటించారు. చిన్నారులు అందరూ ఆకట్టుకుంటారు. 


ప్రతి చిన్నారి దృష్టిలో తండ్రి హీరో. తండ్రి ఫైట్ చేస్తున్నప్పుడు హాలీవుడ్ సినిమా క్యారెక్టర్ వోల్వరైన్‌ను చిన్నారి ఊహించుకునే సన్నివేశం నవ్విస్తుంది. కొంత మందిని అయినా ఆకట్టుకుంటుంది. అయితే, సినిమా అంతా నవ్వులు కోరుకుంటే కష్టం. ఆకట్టుకోవాలని చూసినా అత్యాశే అవుతుంది.


Also Read: 'బ్లడీ మేరీ' రివ్యూ: ఓటీటీలో విడుదలైన నివేదా పేతురాజ్ సినిమా ఎలా ఉందంటే?


'ఓ మై డాగ్' గురించి చెప్పాలంటే... చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకుని తీసిన చిత్రమిది. చిన్నారులను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే... పెద్దలను సినిమా ఆకట్టుకోవడం చాలా అంటే చాలా కష్టం. పెట్ లవర్స్, డాగ్ లవర్స్ అయితే తప్ప సినిమాకు కనెక్ట్ కాలేరు. విజయ్ కుమార్, అరుణ్ విజయ్, అర్ణవ్ విజయ్ - నిజ జీవితంలో తాత, తండ్రి, మనవడు... ముగ్గురినీ తెరపై అటువంటి బంధంలో చూడటం తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులకు 'మనం'లో అక్కినేని కుటుంబంలో మూడు తరాలను తెరపై చూసినప్పుడు కలిగిన అనుభూతి అయితే ఉండదు. పక్కా పిల్లల చిత్రమిది. పిల్లలు ఎంజాయ్ చేస్తారు.


Also Read: 'గాలివాన' రివ్యూ: సాయి కుమార్, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?