International Flight Ban: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసుల సస్పెన్షన్‌ను 2022 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
గత ఏడాది డిసెంబర్ 15 నుంచి పూర్తి స్థాయిలో ఈ సేవలను పునరుద్ధరిస్తామని పౌర విమానయాన శాఖ భావించింది. పలు దేశాలతో పాటు భారత్‌లోనూ ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువవుతోన్న కారణంగా నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. ఈ సమయంలో అంతర్జాతీయ వాణిజ్య విమాన సర్వీసులు నడపటం సరికాదని డీజీసీఏ అభిప్రాయ పడింది. డీజీసీఏ డైరెక్టర్ ఆఫ్ రెగ్యూలేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ నీరజ్ కుమార్ ఓ ప్రకటనలో విమానాల నిషేధం పొడిగింపు నిర్ణయాన్ని వెల్లడించారు.
కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో మొదలైన సమయంలో 2020 మార్చి నెలలో అంతర్జాతీయ వాణిజ్య విమాన సేవలపై తొలిసారి నిషేధం విధించారు. 2020 మార్చి 23న మొదలైన నిషేధ ఆంక్షలు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే కొన్ని రకాల ప్రత్యేక విమాన సర్వీసులు కొవిడ్19 ఆంక్షలతో యథాతథంగా సేవలు అందిస్తాయని ఆ ప్రకటనలో వివరించారు. తాజాగా పొడిగించిన విమాన సర్వీసుల నిషేధం 2022 ఫిబ్రవరి 28 రాత్రి 11:59 వరకు అమలులో ఉంటుంది. అన్ని రకాల కార్గో విమాన సర్వీసులకు దీని నుంచి మినహాయింపు కల్పించారు.
భారతదేశం.. అమెరికా, యూకే, యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బంగ్లాదేశ్, భూటాన్, కెనడా, ఇథియోపియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాక్, జపాన్, కజకిస్తాన్, కెన్యా, కువైట్, మాల్దీవులు, మారిషస్, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, ఖతార్, రష్యా, రువాండా, సౌదీ అరేబియా, సీషెల్స్, సింగపూర్, శ్రీలంక, స్విట్జర్లాండ్, టాంజానియా, ఉక్రెయిన్ మరియు ఉజ్బెకిస్తాన్లతో ద్వైపాక్షిక విమాన ప్రయాణ ఒప్పందం చేసుకుంది.
Also Read: రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ తల్లిదండ్రులపై కేసు ? విచారణకు రావాలని విజయవాడ పోలీసుల నోటీసులు !
Also Read: Compassionate Appointments: ఏపీలో ఆ ఉద్యోగుల కుటుంబాల కారుణ్య నియామకాలకు ఉత్తర్వులు జారీ
Also Read: Gold-Silver Price: అతి స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. రూ.300 పెరిగిన వెండి, నేటి తాజా ధరలు ఇవీ..